Oct 14,2023 22:54

సంక్షేమ పథకాలను వివరిస్తున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- సరుబుజ్జిలి : అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని రొట్టవలస పంచాయతీ పరిధిలోని అవతారబాద్‌, రొట్టవలస గ్రామాల్లో శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గడపగడపకు వెళ్లి వైసిపి ప్రభుత్వంలో లబ్ధిదారులకు అందిన సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్నారని అన్నారు. నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఆలోచన, ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడపగడపకు మన ప్రభుత్వ లక్ష్యం ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మూడడ్ల భద్రమ్మ, జెడ్‌పిటిసి సురవరపు నాగేశ్వరరావు, వైసిపి మండల పార్టీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షులు బద్రి రామారావు, వైస్‌ ఎంపిపి లావేటి అనిల్‌ కుమార్‌, బిసి సెల్‌ జిల్లా డైరెక్టర్‌ మూడడ్ల రమణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.