ఎంఆర్‌పల్లి, చంద్రగిరి సీఐలకు అక్షింతలు
ప్రజాశక్తి - తిరుపతి సిటీ
తిరుపతిలో అరాచక శక్తులు, ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థపై అర్బన్ ఎస్‌పి వెంకట అప్పలనాయుడు నిఘా వేయడం గమనార్హం. సోమవారం ఎస్‌పి తన క్యాంపు కార్యాలయం నుంచి అర్ధరాత్రి వెస్ట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరును పరిశీలించి వి.వి మహల్ రోడ్డు, త్యాగరాజ మండపం పరిసర ప్రాంతాలలో పర్యటించి వెస్ట్ సి.ఐ శివ ప్రసాద్‌కి సూచనలు సలహాలు ఇచ్చారు. రాత్రి గస్తీని ముమ్మరం చేయనున్నారని, విధి నిర్వహణలో సిబ్బంది క్రమశిక్షణతో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం వైకుంటపురం ఆర్చి వద్దకు చేరుకొని బ్లూ కోల్డ్ -1 సిబ్బంది పనితీరు సక్రమంగా లేనందున వారిని మందలించి, ఎం.ఆర్ పల్లి సీఐ సురేంద్ర రెడ్డిని పిలిపించి ఆయనను కఠినంగా హెచ్చరించారు. రాత్రి గస్తీ సక్రమంగా లేనందువల్లే ఎమ్.ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల పెరిగాయని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని సూచించారు. బ్లూ కోల్డ్ 1 సిబ్బంది రాత్రి సమయంలో వ్యక్తికి అవసరమైన టార్చ్ లైట్, వంటివి కూడా లేకుండా విధులు నిర్వహించడంపై, ఎంఆర్ పల్లి సిఐ పనితీరుపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం చెర్లోపల్లి ప్రాంతంలో ఉన్న చెక్పోస్ట్ వద్దకు చేరుకొని అక్కడ సిబ్బంది పని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి రాత్రి గస్తి పై అవగాహన లేకపోవడంపై ఆయన ధ్వజమెత్తారు. నిర్లక్ష్యంతో విధులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అటుపిమ్మట 1:20 నిమిషాలకు విద్యానికేతన్ వద్ద ఉన్న చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి అక్కడ కూడా సిబ్బంది పనితీరు నిర్లక్ష్యంగా ఉండడాన్ని గమనించారు. సిబ్బంది విధి నిర్వహణలో చూపుతున్న తీవ్ర లక్ష్యాన్నిపై మండిపడ్డారు. సిబ్బంది పనితీరు లోని లోపానికి చంద్రగిరి సిఐ పర్యవేక్షణ లోపించడమే అని గుర్తించిన యస్.పి సిఐని తీవ్రస్థాయిలో మందలించారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని అటువంటి వారి పైన శాఖాపరమైన చర్యలు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఏ.ఆర్ డి.ఎస్.పి నందకిషోర్ పాల్గొన్నారు.










