ప్రజాశక్తి-అనంతపురం ఇళ్ల నిర్మాణాల్లో ఆర్డీటీ సహకారం మరువలేనిదని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అనంతపురం నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కురుగుంట లేఔట్‌లో ప్రభుత్వంతోపాటు ఆర్డీటీ సహకారంతో నిర్మించనున్న 630 ఇళ్ల నిర్మాణాలకు శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల విషయంలో ఆర్డీటీ సంస్థ చొరవ తీసుకుని ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ గౌతమి ప్రత్యేకంగా ఆర్డీటీ సంస్థతో మాట్లాడడంతో కురుగుంటలో నిర్మాణాలకు ఒప్పుకున్నారన్నారు. జిల్లాలో ఆర్డీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ అనేక సేవా కార్యాక్రమాలు చేశారని గుర్తు చేశారు. విద్య, గృహ నిర్మాణాలకు ఆర్డీటీ ప్రాధాన్యత ఇస్తూ ఎంతో మంది ఎస్సీ, ఎస్టీలకు తోడుగా నిలిచిందన్నారు. దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా కురుగుంటలో ఆర్డీటీ సంస్థ ఇళ్లు కట్టించిందన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో గుంతకల్లులోనూ గహ నిర్మాణాలు చేశారని తెలిపారు. జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు, మహిళా సంఘాల నుంచి రూ.35 వేలు అందిస్తున్నామన్నారు. దీనికితోడు ఆర్డీటీ సంస్థ ముందుకు వచ్చి ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.25 వేలు భరిస్తోందన్నారు. అందుకు ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛూఫెర్రర్ మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం కురుగుంటలో ఇళ్ల నిర్మాణాలు చేశామని గుర్తు చేశారు. నిర్మాణాలు నాణ్యతగా జరగాలంటే అందరూ సహకరించాలని కోరారు. లబ్ధిదారులు, హౌసింగ్, ఇతర అధికారులు టీంగా పని చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛూ ఫెర్రర్, మేయర్ వసీం, హౌసింగ్ పీడీ కేశవనాయుడు, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మాజీ మేయర్ రాగే పరశురాం, కార్పొరేటర్లు, మున్సిపల్, హౌసింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి










