ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు సిఐటియు అనుబంధ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్‌డి) కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎటిఎం నాగరాజు అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మీనరసమ్మ, మంత్రి వరలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెగ్యులర్ కార్మికులకు సిపిఎస్ రద్దు చేసి జిపిఎఫ్ అకౌంట్స్ తెరవాలని, హెల్త్ కార్డులు, బకాయి సరెండర్ లీవ్ అమౌంట్ ఇవ్వాలని మున్సిపల్ అవుట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీస్కిల్డ్ వేతనాలతో పాటు హెల్త్, రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని, 60 ఏళ్ల పేరుతో తొలగించిన ఇంజినీరింగ్ కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు. మలేరియా, కోవిడ్, గార్బేజ్ కార్మికులను అవుట్‌సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి ఆప్కాస్ లో చేర్చాలన్నారు. వారికి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎంఆర్ కార్మికులకు టైం స్కేలు, కరువు భత్యం, డిఎ, ఐఆర్ లతోపాటు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదివరకే చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ డెత్ బెనిఫిట్స్ అందేలా చూడాలన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు. నగర విస్తీర్ణం, జనాభాకి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, పనిముట్లు, రక్షణ పరికరాలు సకాలంలో అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్‌డి పివివిఎస్ మూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కోశాధికారి బత్తల ఆదినారాయణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాజమోహన్, ఓల్డ్‌టౌన్ ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, అధ్యక్షులు గురురాజా, నగర అధ్యక్ష, కార్యదర్శులు బండారు ఎర్రిస్వామి, సాకే.తిరుమలేశు, ఇంజినీరింగ్ కమిటీ సభ్యులు లోకేష్, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, అధ్యక్ష కార్యదర్శులు అంజి, ఓన్నూరప్ప, క్రిష్ట, శామ్యూల్, రాము తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండ : కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని సత్య సాయి వాటర్ సప్లై యూనియన్ ఉపాధ్యక్షులు బాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఉరవకొండ మండల పరిధిలోని పెద్ద కౌకుంట్ల గ్రామంలో ఉన్న సత్యసాయి వాటర్ సప్లై పంపు హౌస్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు కార్మికులకు రావాల్సిన బోనస్ లీవ్‌లు, గ్రాట్యుటీ చెల్లించే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. నెలల తరబడి జీతాలు లేకున్నా ప్రజల దాహార్తిని తీరుస్తున్న కార్మికుల కుటుంబాల గురించి మాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 13 నియోజకవర్గాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, శీనప్ప, బొజ్జప్ప, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.










