Apr 05,2023 22:35

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం       పంగల్‌ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్‌ వరకు చేపట్టిన అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌ను తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. మంగళవారం యువగళం పాదయాత్రలో భాగంగా అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే అనంత తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిడిమిడి జ్ఞానంతో వాళ్లు మాట్లాడిన మాటలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. లోకేష్‌ అజ్ఞాని అని ఇన్నాళ్లూ అందరూ అంటుంటే ఏదో అనుకున్నానన్నారు. నిన్న బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యలు చూశాక లోకేష్‌ అజ్ఞానం తెలిసిందన్నారు. ఇతరుల మౌత్‌పీస్‌గా లోకేష్‌ ఉంటాడని నిరూపితమైందన్నారు. ప్రభుత్వంపైన, సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మీద, తనపైన అవాకులు చవాకులు పేలారని అన్నారు. లోకేష్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. పక్కనోళ్లు చెప్పినంత మాత్రాన ఏది వాస్తవమో తెలుసుకోకపోతే ఎలాగని ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర పేరుతో ఏ నియోజకవర్గంలోకి వెళ్తే అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై బురదజల్లి వాళ్లే కడుక్కుంటారన్న ధోరణిలో లోకేష్‌ సాగుతున్నాడని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలోనే అనంతపురం అభివృద్ధి చెందిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. 2014 నుంచి 2019 వరకు అనంతపురంలో ఏం జరిగిందో ఇక్కడి ప్రజలందరికీ తెలుసన్నారు. నిత్యం శాంతిభద్రతలకు విఘాతం కల్పించారన్నారు. ఇప్పుడు అనంతపురం ప్రశాంతంగా ఉందని చెప్పారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడ, ఎవరి కొంప కూలగొడతారోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఉండేదన్నారు. అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌ను మీరు తెచ్చిందే నిజమైతే 2015లో నేషనల్‌ హైవే పరిధిలో ఉన్న రోడ్డును ఎందుకు ఆర్‌అండ్‌బి పరిధిలోకి తెచ్చారని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో, తనకున్న పరిచయాలతో ఆర్‌అండ్‌బి నుంచి నేషనల్‌ హైవేస్‌లోకి మార్చినట్లు స్పష్టం చేశారు. అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సిఎం జగన్‌ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారన్నారు. 2024 ఎన్నికల్లోనూ వైసిపి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్‌కు అంత ఉబలాటంగా ఉంటే హిందూపురంలో ఆయన ముద్దుల మామయ్యతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. అప్పుడు ప్రజల అభిప్రాయం తెలుస్తుందన్నారు.