అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని ఆర్‌బికె కేంద్రాల్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఎమ్.గౌతమి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ టి.రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో మినీ కాన్ఫరెన్స్ హాల్ జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ 2023 సంబంధించి ప్రతి ఆర్‌బికెలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు పంట రుణాలు అందించడానికి బ్యాంకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది కలిసి చర్యలు తీసుకోవాలన్నారు. పంటల ప్రణాళికలు చేసుకునే విధంగా రైతులలో అవగాహన కల్పించాలన్నారు. పంట నమోదును కూడా పక్కాగా నిర్వహించి మద్దతు ధరతో పంటల కొనుగోలు, నష్టపోయిన రైతులకు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందేలా చూడాలన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం మంది రైతులు ఎండుమిరపను సాగు చేశారన్నారు. ఈ పంట నల్లతామర పురుగు వల్ల దెబ్బతినిందన్నారు. ఉద్యానవన శాఖ సిబ్బంది, శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆ రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. రైతు భరోసా కేంద్రంలో ఎరువులు, సూక్ష్మధాతువులు, జిప్సం, పత్తి, మిరప, మొక్కజొన్న విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో పెండింగ్ ఉన్న పంటల బీమా నగుదును రైతు ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా వ్యవసాయ అధికారి బి.చంద్రనాయక్‌తో పాటు జిల్లా స్థాయి వ్యవసాయ, అనుబంధ స్థాయి అధికారులు పాల్గొన్నారు.










