Oct 27,2022 22:06

ఆర్‌బికెల్లో ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ డిపార్ట్మెంట్‌ డీజీ శంఖ భ్రత భాగ్చి ఆదేశాల మేరకు గురువారం వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పధకం అమలు తీరుపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారి ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు నాలుగు బందాలుగా ఏర్పడి ఉదయం నుంచి విస్తతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్‌బికె కేంద్రాల ద్వారా రైతులకు అందచేసే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు ఏవిధంగా పంపిణీ తీరును పరిశీలించారు. అలాగే పొలంబడి, తోటబడి, పశువిజ్ఞానంకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేశారు. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, అనిమల్‌ హిస్బండ్రీ అసిస్టెంట్‌, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ల పనితీరు ఎలా వుంది, వైఎస్‌ఆర్‌ యంత్ర సేవ పథకం ఎలా అమలు అవుతుంది, డిజిటల్‌ సేవలు రైతులు ఎలా ఉపయోగించు కుంటున్నారు, లోటుపాట్లు అవక తవకలు ఉన్నాయా, విషయాలపై కూలంకషంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు ఈశ్వరరెడ్డి తెలిపారు. గురువారం చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల, పూతలపట్టు మండలంలోని చిటిపిరాల్ల ఆర్‌బికె కేంద్రాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. తమ పరిశీలనకు వచ్చిన విషయాలను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. సంబంధిత అధికారులను, రైతులను విచారించి వారి నుండి ఫీడ్‌బ్యాక్‌ తెలుసుకున్నారు. అలాగే ఆర్‌బికె కేంద్రాల మీద, సంక్షేమ వసతి గహాల మీద, ఆరోగ్య కేంద్రాల మీద, ప్రభుత్వ పథకాల అమలు మీద నిరంతరం పరిశీలన కొనసాగుతుందన్నారు.
ఆర్బీకేలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ తనిఖీలు
పులిచెర్ల: పులిచెర్ల రైతుభరోసా కేంద్రంలో తిరుపతి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆర్బీకే ద్వారా రైతులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందుతున్న తీరు తెన్నులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రంలోని రికార్డులను పరిశీలించిన అనంతరం క్షేత్రస్థాయిలో పంట నమోదును పరిశీలించారు. రైతుల వద్ద నుంచి పంటల కొనుగోలు గురించి అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాల పనితీరు సంతప్తిగా ఉందన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీచేస్తున్న రికార్డులు పారదర్శకంగా ఉన్నాయన్నారు. ఆర్బీకేలో ప్రభుత్వ నిబంధనల మేరకు సిబ్బంది నిర్వహిస్తున్నారని కితాబిచ్చారు. ఏవో హరిప్రసాద్‌, వీహెచ్‌ఏ లీలా వరప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.