Oct 29,2023 21:50

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

* నాలుగున్నరేళ్లుగా జగన్‌ రాష్ట్రాన్ని దోచుకున్నారు
* చంద్రబాబును ఎదుర్కోలేక అక్రమ అరెస్టు
* టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో నాయకులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలన వచ్చే ఎన్నికల్లో అంతం కాక తప్పదని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసమే టిడిపి, జనసేన ముందుకు కలిసి సాగుతున్నాయని చెప్పారు. నగరంలోని ఒక హోటల్‌లో టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశాన్ని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా జగన్‌ రాష్ట్రాన్ని లూటీ చేసి, పేదలకు బతుకు లేకుండా చేశారని ఆరోపించారు. దోచుకోవడానికే తన పదవిని వినియోగించుకున్నారని, నమ్మిన ప్రజలను నట్టేట ముంచారన్నారు. సంక్షేమ పథకాల పేరు చెప్పి ధరలు, పన్నుల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. స్కిల్‌ స్కామ్‌గా చెప్తున్న వైసిపి నాయకులు ఎక్కడ అవినీతి జరిగి ఎవరికి డబ్బులు వెళ్లాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబుని ఎదుర్కోలేక అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు. టిడిపి, జనసేన కలిస్తే చిత్తు చిత్తుగా ఓడిపోతామనే భయంతో వైసిపి నాయకులు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఓటమి భయంతోనే ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు.
టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత మాట్లాడుతూ జగన్‌ బాబా 151 మంది దొంగలు బస్సులు వేసుకుని యాత్రల పేరిట తిరుగుతున్నారని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిల తన వాళ్లని వేదికలపై జగన్‌ చెప్తారని, పదవులు మాత్రం రెడ్లకు ఇచ్చారన్నారు. వ్యవస్థల మేనేజ్‌ గురించి విజయసాయిరెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి పదేళ్లుగా బెయిల్‌పై బయట తిరుగుతున్నదెవరని ప్రశ్నించారు. సొంత బాబాయిని చంపిన వారిని శిక్షించలేని వారు ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. పొత్తుల సమయంలో త్యాగాలు అవసరమని, సీట్ల పంపకాల విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
జనసేన సమన్వయకర్తలు బొమ్మిడి నాయకర్‌, పాలవలస యశస్వని మాట్లాడుతూ రోజురోజుకూ వైసిపి అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల బతుకులు మారాలంటే జనసేన, టిడిపి ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్‌ నినాదమే ప్రధాన అజెండా కావాలన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి భూ కబ్జాలు చేస్తున్న మంత్రి అప్పలరాజుకు లేదన్నారు. అప్పలరాజు ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి, మాజీ ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తి, కె.మురళీమోహన్‌, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, జనసేన నాయకులు గేదెల చైతన్య, విశ్వక్‌సేన్‌, కోరాడ సర్వేశ్వరరావు, పేడాడ రామ్మోహన్‌, కణితి కిరణ్‌, దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు.