- పాలకొల్లులో రొయ్యల రైతులు పిలుపు
ప్రజాశక్తి-పాలకొల్లు : ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధిగమించడానికి ఐక్యంగా పోరాడారని పాలకొల్లు ఎఎంసి మాజీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు కోరారు. పాలకొల్లు ఎస్ఎస్ఎస్ కల్యాణ మండపంలో జిల్లా ఆక్వా రైతుల సమావేశం శుక్రవారం జరిగింది.సమావేశంలో ఆయన మాట్లాడుతూ రొయ్యల రైతులు ఐక్యంగా లేకపోవడంతో గిట్టుబాటు ధరలు లేక నష్టాలబారిన పడుతున్నారని చెప్పారు. ప్రాసెస్ యూనిట్లు, ఫీడ్,హేచరీలు రైతులను దోచేస్తున్నాయని రైతులు ఐక్యంగా ప్రభుత్వంతో పోరాడి గిట్టుబాటు ధర తెచ్చుకొంటే నష్టాల ఊబి నుంచి గట్టెక్కుతారని చెప్పారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు క్రాప్ హాలిడే ప్రకటించాలని ఆయన కోరారు. గిట్టుబాటు ధర రాకపోతే అవసరం అయితే ఒక ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించాలని అపుడు ప్రభుత్వంతో పాటు అన్ని ఫ్యాక్టరీలు దిగి వస్తాయని చెప్పారు. మరో రైతు బోనం చినబాబు మాట్లాడుతూ నాణ్యమైన సీడ్ హేచరీస్ లో దొరక్క రైతులు ఆదిలోనే నష్టపోతున్నారని చెప్పారు. రైతుల సమస్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసికెళ్ళాలని రైతు పెన్మెత్స సత్యనారాయణ రాజు చెప్పారు. ఆక్వాజోన్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఎత్తివేస్తోందని జాన్ రాజు చెప్పారు. ప్రోసెస్, ఫీడ్, సీడ్ ప్రతినిధిలతో సమావేశం ఏర్పాటు చేసి సహకరించని వారిని రైతులు బహిష్కరించాలని కోడి విజయ భాస్కర్ కోరారు. రొయ్యల్లో అనేక పోషకాలు ఉన్నాయని స్థానికంగా కూడా వాడకం పెరిగితే రొయ్యల రైతులు నష్టాల నుంచి గట్టెక్కుతారని చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పాల్గొన్నారు .










