May 13,2023 22:09

ప్రజాశక్తి - ఆకివీడు
               మండలంలో విద్యుత్‌ కోత సర్వ సాధారణం అయిపోయింది. ఇక్కడ అప్రకటిత విద్యుత్‌ కోత నిరంతరంగా కొనసాగుతోంది. వేళ పాళ, రాత్రి పగలు తేడా లేకుండా కోత విధిస్తున్నారు. గత నాలుగు ఐదు రోజులుగా ప్రతిరోజు 15 నుంచి 18 గంటలు విద్యుత్‌ కోత విధిస్తున్నారు. కరెంటు ఎంతసేపు తీస్తాడో, ఎప్పుడు తీస్తారో తెలియదు. ఇంట్లో కార్యక్రమాలకు గాని, వంట కార్యక్రమాలకు గాని కరెంటు దొరికే పరిస్థితి లేదు. ఇక మంచినీళ్ల పరిస్థితి సరేసరి. రోజు మొత్తంలో కరెంటు లేకపోవడంతో కుళాయి మంచినీళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. ఇది సాధారణ గృహస్థుల పరిస్థితి. వేసవిలో విద్యుత్‌ లేకపోవడంతో కరెంటు లేక గాలి లేక సాధారణ ప్రజానీకం నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇదిలా ఉండగా విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ఇంటర్మీడియట్‌, పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఉన్నాయి. పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు రాత్రి పగలు చదువుకునే పరిస్థితి. ఎండ వేడిమి తాళలేక ఫ్యాను గాలి లేక పుస్తకం తీసి చదవలేని పరిస్థితి. ఇక రాత్రులు చదవడానికి కరెంటు ఉండదు. గత నాలుగు రోజులుగా సాధారణ ప్రజానీకం విద్యుత్‌ శాఖ కార్యాలయానికి తరచూ జట్లు జట్లుగా వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర విధుల్లో ఉన్న సిబ్బంది మాత్రమే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఆక్వా రైతుల ఆవేదన
కరెంటు సమస్య పెరిగిపోవడంతో చెరువులో ఉండే ఫ్యాన్లు తిరక్క రొయ్యలకు ఆక్సిజన్‌ అందటం లేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. ఒకపక్క భారీ స్థాయిలో ఎండలు కాస్తుంటే అక్కడక్కడ రొయ్యలు చెదురు మాదిరిగా చనిపోతున్నాయి. మరోపక్క చేపల ఎగుమతికి అవసరమైన ఐసు ధర మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని చేపల రైతులు ఆందోళన చెందుతున్నారు.
సమాధానం చెప్పని అధికారులు
కరెంటు కోతపైన అధికారుల కోసం ఫోన్‌ చేసే వారికి పూర్తి నిరాశ మిగులుతుంది. విద్యుత్‌ కోత ఎంతసేపు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరూ ఇక్కడ ఫోన్‌ ఎత్తరు. కరెంట్‌ ఆఫీసులో గాని అధికారులు వ్యక్తిగత ఫోన్లు గాని ఏ ఒక్కరూ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కరెంట్‌ ఆఫీస్‌కి ఎవరూ వెళ్లిన అధికారులు ఫీల్డ్‌లో ఉన్నారన్నదే అక్కడ సమాధానం. ఫోన్‌లోను దొరకరు కార్యాలయాల్లోనూ దొరకరు కరెంట్‌ ఎందుకు తీస్తున్నారో తెలవదు. అధికారికంగా మాత్రం కరెంటు కోతలేదని చెబుతున్నారు.