Apr 02,2023 08:46

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

         అనంతపురం కలెక్టరేట్‌ : కర్నాటక రాష్ట్రంలో అప్పర్‌ భద్రా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఏపీలో రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి నీటి సామర్థ్యంతో నిర్మించాలని కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న అప్పర్‌ భద్రా ప్రాజెక్టును ఆపాలని జిల్లా కేంద్రంలోని కమ్మ భవన్‌ లో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ, టీడీపీ పాలిట్‌ బ్యూరో సభ్యుడు,మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు దాదా గాంధీ, సీపీఐ ఎంఎల్‌ జిల్లా కార్యదర్శి పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల లబ్ధికోసమే అప్పర్‌ భద్ర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారని ఏకరువు పెట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అనుమతులు సైతం లేవని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారేగాని నిధులు ఏమాత్రం మంజూరు చేయడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఇరిగేషన్‌ ప్రాజెక్టులను గాలికి వదిలేసిందన్నారు. ఇప్పటికైనా బిజెపి తన విధానాలు మార్చాకుని రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను కాపాడే చర్యలు తీసుకోవాలన్నారు.