Aug 09,2022 15:54

ప్రజాశక్తి-వి కోట : కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ తమను వ్యతిరేకించే వాళ్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని గద్దె దింపాలని జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి చైతన్య పిలుపునిచ్చారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం సామూహిక జన జాగరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆగస్టు 15న భారతదేశ ప్రజలు 75వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం  దీనిని అమృతమహోత్సవం కార్యక్రమంగా జరుపుకోవాలనడం హాస్యాస్పదం అన్నారు.వాస్తవానికి మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు కార్మికులకు అమృతాన్ని కాకుండా విషాన్ని పంచిపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఆరెఎస్సెస్ లకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునే అర్హత లేదన్నారు.వాస్తవానికి స్వాతంత్య్ర పోరాటానికి వారసులైన రైతులు కార్మికులు శ్రామికవర్గానికి మాత్రమే స్వతంత్రాన్ని జరుపుకునే   హక్కు ఉందన్నారు.ఇందులో భాగంగా ఆగస్టు1 నుండి 14 వరకు మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఉద్యమించాలని పిలుపు ఇచ్చినట్లు వారు తెలిపారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రయివేటీకరణ సరళీకరణ విధానాలు  కార్మిక  సామాన్య ప్రజల జీవితాలను మరింత దిగజార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగం పెరిగిందని కీలక మిలటరీ విభాగాల్లో నాలుగు సంవత్సరాలకు ఉద్యోగాల్లో నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో కూడా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి ఔట్సోర్సింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు ధరల భారాన్ని మోయలేక పోతున్నారని నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు అమాంతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్ కే సాత్ సబ్ కా వికాస్ నినాదం అలంకారప్రాయంగా మిగిలిందని ఎద్దేవా చేశారు. కార్మిక హక్కులకు విఘాతం కల్గిస్తూ చట్టాల్లో సవరణలు చేస్తూ వారి హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం యజమానులకు అమృతాన్ని పంచుతూ కార్మికుల జీవితాల్లో విషాదాన్ని నింపుతోందని పేర్కొన్నారు. మైనారిటీలు  దళితులు మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి   భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కార్మికులు స్వతంత్ర ఫలాలను అందుకోవాలంటే ప్రైవేటీకరణ సరళీకృత విధానాలను అవలంబించె ప్రభుత్వాలకు అధికారాన్ని కట్టబెట్టరాదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  సీఐటీయూ మండల కార్యదర్శి అనితా అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి శ్యామల వీఆర్ఏ జిల్లా జాయింట్ సెక్రటరీ కోదండ పంచాయతీ కార్యదర్శి గోవిందా ఉదయ్ వీఆర్ఏల సంఘ నాయకులు వెంకటేష్  కృష్ణమూర్తి  తదితరులు పాల్గొన్నారు.