ప్రజాశక్తి భీమవరం రూరల్ : అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నోటీసులు, అరెస్టులు, దాడులు సిగ్గుచేటని సిఐటియు జిల్లా కార్యదర్శి డి కళ్యాణి అన్నారు. సోమవారం స్థానిక ప్రకాశం చౌక్ లో అంగన్వాడీల పోలీసు దాడులను నిరసిస్తూ ధర్నా జరిగింది. విజయవాడకు వెళ్ళనివ్వలేనందుకు నిరసనగా అంగన్వాడీలంతా భీమవరం ప్రకాశం చౌక్ కి చేరుకుని తమ నిరసనను ఆందోళనను తెలియజేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించాలి అనే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలంతా చైతన్యవంతంగా ప్రతి విషయంలోనూ మాపై దాడి చేస్తున్న ప్రభుత్వానికి వత్తాసుగా పోలీసులు వ్యవహరించడం దారుణమని ఖండించారు. టిక్కెట్ తీసుకుని బస్సు ఎక్కిన వాళ్లను, ట్రైన్ ఎక్కిన వాళ్లను ఆపే హక్కు పోలీసులకు ఎక్కడదని ప్రశ్నించారు. రోడ్డుపై బైఠాయించి పోలీసులు జలుం నశించాలని, దౌర్జన్యాలు అరికట్టాలని నినదించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు తోపులాట, వాగ్వివాదం జరిగింది. అనంతరం కళ్యాణి మాట్లాడుతూ పోలీసు నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారి ఇళ్లపై అర్ధరాత్రి వెళ్లి ఇబ్బంది పెట్టడం సరైంది కాదని అన్నారు. కనీస వేతనాలు అమలు చేస్తామని ప్రభుత్వమే గతంలో వాగ్దానం చేసిందని, కోర్టు తీర్పులు కూడా ఈ విషయంలో ఉన్నాయని వాటన్నిటినీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చట్ట వ్యతిరేకమని అన్నారు. చట్ట వ్యతిరేక పనులు ప్రభుత్వం చేస్తూ అమాయకులైన అంగన్వాడీలపై దాడులు చేయటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.










