- ఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున
ప్రజాశక్తి-రాయదుర్గం : అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అంగన్వాడి వర్కర్లను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయించడం ఎంత మేరకు సమంజసమని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున ప్రశ్నించారు. మార్చి 20వ తేదీన అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడి వర్కర్లు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసగొలిపి ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తూ ప్రశ్నించే గొంతుకులను నొక్కువేయాలని చూడటం హాస్యాస్పదమని అన్నారు. సోమవారం అంగన్వాడి వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, రాయదుర్గం తహసిల్దార్ కార్యాలయం వద్ద అరగంట పాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ, అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలను పెంచాలని కోరారు. పేస్ యాప్ రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో అంగన్వాడీలపై రాజకీయ వేధింపులను ఆపాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ అయిదు లక్షలు, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు జాబ్ క్యాలెండర్ నిర్ణయించాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరిపడా చేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వింత పత్రాన్ని తహసిల్దార్ మారుతికి అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కార్యదర్శి మేరీ, యూనియన్ నాయకులు రాధా, అనురాధ, శోభారాణి, మల్లక్క, ఉల్లిగమ్మ, చంద్రకళ, లతా, కృష్ణవేణి మరియు అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు.










