Oct 24,2023 21:08

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

ప్రజాశక్తి - ఇచ్ఛాపురం: అన్ని వర్గాలకు రాజ్యాధికారం లక్ష్యంగా సామాజిక సాధికారిత బస్సు యాత్ర చేపడుతున్నట్లు బస్సు యాత్ర పరిశీలకులు ఎమ్మెల్సీ ఎల్‌.అప్పిరెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో సామాజిక సాధికారిత బస్సు యాత్ర సన్నాహక సమావేశాన్ని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాధికారం అన్ని వర్గాలకు అందించాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అన్ని ప్రధాన పదవులు వెనుకబడిన తరగతుల వారికి కేటాయించిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఈనెల 26న మధ్యాహ్నం మూడు గంటలకు ఇచ్ఛాపురంలో ప్రారంభమవుతుందని తెలిపారు. బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యాత్రలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బస్సు యాత్ర కోసం తరలివచ్చే ప్రజానీకానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో నవరత్నాల ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ లక్ష్మణమూర్తి, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మారిటైమ్‌ బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, కళింగ, రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్లు పేరాడ తిలక్‌, దుక్క లోకేశ్వరరెడ్డి, సీడాప్‌ చైర్మన్‌ శాడి శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్లు ఉలాల దివ్యభారతి, లాభాల స్వర్ణమణి తదితరులు పాల్గొన్నారు.
బస్సు యాత్రలో భాగస్వామ్యం కావాలి
ఈనెల 26వ తేదీన ఇచ్ఛాపురంలో ప్రారంభం కానున్న సామాజిక సాధికారిత బస్సు యాత్రలో మహిళా సంఘాలు భాగస్వామ్యం కావాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ కోరారు. మండలంలోని లొద్దపుట్టిలో స్వయంశక్తి సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి మహిళలు అండగా నిలవాలన్నారు. మహిళల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని తెలిపారు. వెలుగు ఎఎపి ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సంఘాల సభ్యులు పాల్గొన్నారు.