ప్రజాశక్తి-ఉరవకొండ రైతులు పండించే అన్ని పంటలకూ వాతావరణ బీమాను వర్తింపజేయాలని ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో గురువారం ఉరవకొండ డివిజన్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కురుగుంట మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొంతమంది రైతలకు, కొన్ని రకాల పంటలకే బీమాను వర్తింపజేయడం బాధాకరమన్నారు. అధిక శాతం రైతులు సాగు చేసే పంటలకు బీమాను వర్తింపజేయకపోవడం వల్ల చాలామంది రైతులు నష్టపోయారన్నారు. పంటల బీమా వర్తింపులో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. కాగా బీమాలో న్యాయం చేయాలని రైతులు పోరాటం చేస్తే అక్రమ కేసులు బనాయించడం బాధాకరమన్నారు. ప్రశ్నించేతత్వాన్ని అణచివేసే ధోరణి మంచిది కాదన్నారు. 20021-22 సంవత్సరానికి సంబంధించిన రైతుల బీమా, నష్టపరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చిరుధాన్యాలను పూర్తి సబ్సిడీతో రైతులకు మంజూరు చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో రైతులను కలుపుకుని ఆందోళనలకు శ్రీకారం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు ప్రసాద్, మారెప్ప, కాసీం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున రైతుసంఘం నాయకులు










