Apr 03,2022 23:13

సినర్జీ ప్రతినిధులు

 యుఎస్‌ కంపెనీ భరోసా
వరిపంటకు రూ.1,650లు ధర
ప్రజాశక్తి -తొట్టంబేడు :

అన్నదాతలకు అండగా ఉంటూ ఆర్థిక భరోసా కల్పిస్తామని యూఎస్‌కు చెందిన సినర్జీ ఫార్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ గొల్లపల్లి ప్రసాద్‌ అన్నారు. తిరుపతి జిల్లాలోనే ప్రథమంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలోని రౌతుసూరమాల గ్రామంలోని రేణుక బయో ఫార్మ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజారెడ్డి సహకారంతో అన్నదాతలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు ముందుకు వచ్చామని గొల్లపల్లి ప్రసాద్‌ అన్నారు. నేడు అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా నష్టపోతున్నారన్నారు. ఐతే ఇవన్నీ తాము టీవీలో చూస్తామని అన్నదాతలకు భరోసా కల్పించేందుకు ముందుకు వచ్చామని అన్నారు. ప్రస్తుతం 22 మంది రైతులను ప్రోత్సహించి 57 ఎకరాల్లో వరిపంటను సాగు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏడు ఎకరాల్లో వరి కోతలు పూర్తి అయ్యాయని మిగిలిన 50 ఎకరాల్లో పంట కోతకు వచ్చిందని మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కోతలు చేస్తామన్నారు. పంట సాగు విషయంలో ఎలాంటి క్రిమిసంహారక మందులు, రసాయనాలు లేకుండా సాగు చేసినట్లు వివరించారు. పండించిన ధాన్యం బస్తాపై క్యూ ఆర్‌కోడ్‌ స్కాన్‌ చేస్తే పంట పండించిన రైతు వివరాలు, వాడిన మందులు, ఎక్కడ పండించింది తెలుసుకోవచ్చన్నారు. ఇది కొత్తరకం ప్రయోగం అన్నారు. పండించిన పంటను ఇక్కడే విక్రయించాలా లేక ఇతర మార్కెట్లకు తరలించాలా అన్న విషయాలను పరిశీలిస్తున్నామని అయితే మార్కెట్‌తో లింకేజి పెట్టుకుని విక్రయిస్తే మంచిదని అభిప్రాయ పడుతున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చే ఎంఎస్‌పి రూ.9.40పైన తమ సినర్జీ కంపెనీ రూ. 22 ఎంఎస్‌పి ఇస్తున్నామన్నారు. ఒక్క వరి పంట కాకుండా వేరుశనగ, కూరగాయలు, ఫిషరీస్‌, పండ్లు తదితర వాటిపై కూడా దష్టి సారించి అన్నదాతల వద్ద సాగు చేయిస్తామన్నారు. ఫ్రాన్స్‌కి చెందిన అగ్రోమిస్ట్‌ మాథిల్‌ మాట్లాడుతూ భారతదేశంలో పంటల సాగు తెలుసుకునేందుకు వచ్చామని ఇక్కడి సాగు పద్ధతులు తెలుసుకున్నామని పేర్కొన్నారు. రేణుక బయోఫార్మ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ సినర్జీ కంపెనీ అన్నదాతలకు 75 కిలోల బస్తాను రూ.1,650లకు తీసుకుంటారని వివరించారు. విషరహిత ధాన్యం ఉత్పత్తులు పండించడమే లక్ష్యమన్నారు. ఆధునిక పద్దతులను ఉపయోగించి సాగు చేస్తున్నామన్నారు. అనంతరం వరి పంటను పరిశీలించి రైతులతో ముఖాముఖి కార్యక్రమం ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో సినర్జీ బయో ఫార్మ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్స్‌ గొల్లపల్లి ప్రసాద్‌, గొల్లపల్లి వెంకటరమణ, డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ ఉషశ్రీ, ధర్మేంద్ర, గ్రామీణ వికాస్‌ సమితి అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, నెల్లూరుకు చెందిన పద్మనాభ రెడ్డి పలువురు అన్నదాతలు పాల్గొన్నారు.