తడిసిన, మొలకెత్తిన ధాన్యంతో రైతుల అవస్థలు
ప్రజాశక్తి - ఆచంట
అకాల వర్షం రైతులను నిండా ముంచింది. పంట చేతికొచ్చే సమయంలో తుపాను కారణంగా రైతులను ఆర్థికంగా మరింత కుంగదీసింది. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని దాళ్వా సాగు చేసినా వాతావరణం అనుకూలించకపోవడంతో ఎకరాకు ఎనిమిది నుంచి పది బస్తాల వరకూ దిగుబడి కోల్పోయామంటూ రైతులు కంటతడి పెడుతున్నారు.
మండలంలో ఈ ఏడాది దాదాపు 12,300 ఎకరాల్లో దాళ్వాసాగు చేశారు. ఈ ఏడాది ధాన్యం దిగుబడి భారీగా పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో అన్నదాతలకు దిగులు పట్టుకుంది. కురిసిన వర్షాలకు పంట చేలు నీట మునిగి, నేలకొరిగి దెబ్బతినడంతో పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. కనీసం సాగు ఖర్చులు కూడా వచ్చేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట ప్రారంభ దశలో సాగునీటి కోసం ఎకరాకు రూ.5 వేల వరకూ వెచ్చించారంటే ఆశ్చర్యం కలగమానదు. ఎలుకలు, చీడపీడలను ఎదుర్కొని సాగుచేసిన రైతులను ప్రకృతి వైపరీత్యాలు కొంగదీశాయి. వర్షానికి మండలంలో ఆచంట, ఆచంట వేమవరం, కొడమంచిలి, పెనుమంచిలి, వల్లూరు, కరుగోరుమిల్లి, పెదమల్లం, కోడేరు గ్రామాల్లోని అనేక చోట్ల పంట పొలాలు నేలకొరిగాయి. ఆరబెట్టుకున్న ధాన్యం రాశుల్లోకి నీరు చేరడంతో ధాన్యం మొలకెత్తి, రంగు మారడంతో రైతులు లబోదిబో మంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎఫ్‌సిఐ ద్వారా ద్వారా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
రైతులను ఆదుకోవాలి
మేకా ఉదయభాస్కర్,కౌలు రైతు, ఆచంట
ఆర్‌బికెల్లో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లూ చేశామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా సంచుల కొరత తీవ్రంగా ఉంది. ఒక పక్క వాతావరణం అనుకూలించకపోవడం, తేమశాతం పేరుతో రైతులు అనేక అవస్థలకు గురవుతున్నారు. తక్షణం ప్రభుత్వం కల్పించుకుని రైతులను ఆదుకోవాలి.
సంచులు అందుబాటులో ఉంచాలి
బాలం నాగేశ్వరరావు, కౌలు రైతు, కొడమంచిలి
పంట చేతికొచ్చే సమయంలో ఏటా ప్రకృతి విరుచుకుపడుతోంది. దాళ్వాలో పంటలు బాగానే పండాయి. పనులు ముమ్మురంగా సాగుతున్న తరుణంలో తుపాన్ ప్రభావంతో రైతులకు కంటిమీద కునుకు ఉండటం లేదు. ధాన్యం రాశుల కిందకు నీరు చేరడంతో రైతులకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రాత్రీ పగలు తేడా లేకుండా ధాన్యం రాశుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. అవసరమైన సంచులు అందుబాటులో లేక పరిస్థితి గోరుచుట్టు పై రోకలి పోటులా ఉంది. తక్షణం ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.










