అనంతపురం కలెక్టరేట్ : జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు నిర్ణీత గడువు లోపు పూర్తిచేయాలని కలెక్టర్ ఎమ్.గౌతమి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎల్‌సి, మైనర్ ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఏపీఎంఎస్‌ఐడిసి ఎస్‌ఈలతో వారి శాఖలలో జరుగుతున్న పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి శాఖలలో చేపడుతున్న పనుల ప్రగతి గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మైనర్ ఇరిగేషన్ శాఖ పనులపై సమీక్షిస్తూ, మైనర్ రిపేర్లకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఇందులో అత్యవసరమైన పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపితే ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి అనంత సాగరం చెరువు సుందరీకరణ పనులు చేపడతామని వారు ముందుకు వచ్చారని, అందుకు సంబంధించి ఉన్నతాధికారులతో మాట్లాడాలన్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. వానలు వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పనులను అనుకున్న సమయంలోపు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రిచే గుర్తింపు పొందిన పనులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. మనబడి నాడు-నేడు పనులకు ప్రాధాన్యతను ఇచ్చి జూన్ 10వ తేదీలోగా వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖలో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు అన్ని టెండరు ప్రక్రియ పూర్తీ చేసి, నిర్ణీత గడువు లోపు పుర్తిచేయాలని సూచించారు. నాబార్డ్ కింద చేపట్టిన 9 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నిర్మాణాలు ఒక ఏరియా హాస్పిటల్ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, హెచ్‌ఎల్‌సి ఎస్‌ఈ రాజశేఖర్, డీఈఈలు, పిఆర్ ఎస్‌ఈ భాగ్యరాజ్, కార్యనిర్వాహక ఏపీఎస్‌ఎమ్‌ఐడిసి డిఈఈలు శ్రీనివాసుల నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










