ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ వర్షాభావంతో పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో రాప్తాడు మండలం, రామినేపల్లి గ్రామంలో సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో వర్షాలు రాక పంటలు సాగు చేయక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. సాగు చేసిన రైతుల పంటలు ఎండి నష్టపోయారని తెలిపారు. వేరుశనగ 2.31 లక్షలు హెక్టార్లలో సాగు కావాల్సి ఉంటే ఒక లక్ష 16 వేల హెక్టార్లు మాత్రమే సాగు జరిగిందన్నారు. సాగు చేసిన పంట కూడా జులై ఆగస్టు నెలలో వర్షాలు రాక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. వేరుశనగ ఊడలు దిగే సమయంలో వర్షం రాకపోవడంతో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినిందన్నారు. కావున ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా పెసర, ఉలవలు, సజ్జ, ఆముదం, జొన్న, అనుములు, కొర్రలు ఉచితంగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి ఎం. పోతులయ్య, రైతులు లింగన్న, నారాయణ, కొండారెడ్డి, మేకల లింగన్న, వెంకటరాముడు, భాషా తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ పంటను పరిశీలిస్తున్న ఎపి రైతు సంఘం నాయకులు










