అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని వెంకటాంపల్లి, కుందుర్పి మండలంలోని బండమీదపల్లి గ్రామాల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఆహార శుద్ధి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం రూ.1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహార శుద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం వెంకటాంపల్లి, కుందుర్పి మండలంలోని బండమీదపల్లి గ్రామాల పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లను ప్రారంభించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ కార్యక్రమంలో కలెక్టర్ యం.గౌతమి, ఎఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో కలెక్టర్ గౌతమి మాట్లాడారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఆహార శుద్ధి ప్రాజెక్టుల ద్వారా టమోటా సాగు చేసే రైతులు, ఇతర కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే రైతులు దాదాపు 60 వేల మంది లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో 2 ఎఫ్‌ఒలు ఏర్పాటు చేసుకుని ప్రాసెసింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎకాలజీ సెంటర్ ప్రోత్సహిస్తుస్తోందని చెప్పారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జిల్లాలో ఏర్పాటు చేసే ఒక్కో ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ (పిపిసి) కోసం రూ.5.50 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారు. అనంతరం పలువురు రైతులు ముఖ్యమంత్రితో వీడియో కాన్పిరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రఘునాథ రెడ్డి, ఎపిఎంఐపి పీడీ ఫిరోజ్ ఖాన్, ఫిషరీష్ డిడి శాంతి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నాగరాజ్, కళ్యాణదుర్గం ఎంపీపీ మారతమ్మ, జెడ్పీటీసీ బొమ్మన్న పాల్గొన్నారు.










