అనంతపురం : రూ.311కోట్లతో 9.2కిలోమీటర్ల మేర నాలుగు వరసల రహదారి పనులు చేపట్టామని నగర ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్‌పెడుతూ 16 నెలల్లోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశామని స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.సోమవారం సాయంత్రం స్థానిక టవర్ క్లాక్ సమీపంలో లోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి విద్యుత్ దీపాల అలంకరణ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకుని సంక్షేమంతో పాటు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అందుకు ఉదాహరణ అనంత నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రహదారుల నిర్మాణం, డ్రైనేజీ పనులను చేపట్టి సుమారు 70 నుంచి 75 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. మరో 25 శాతం పనులను అతి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.ఈ ప్రాజెక్టును ఎస్‌ఆర్‌సి ఇన్‌ఫ్రా డెవలపర్స్ కాంట్రాక్ట్ తీసుకుని మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని తమకు తెలిపారన్నారు. కానీ తాను ఈ నిర్మాణాన్ని 12 నెలల్లోనే పూర్తి చేయాలని కోరాననిఅందుకు ఆ సంస్థ చైర్మన్ అమిలినేని సురేంద్రబాబు అవినాష్ రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. వారు హామీ ఇచ్చిన గడువు కన్నా నాలుగు నెలల ముందే ఈ రహదారి పనులను నిర్మించారన్నారు. ఇందుకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ ఎమ్మెల్యే కతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకించి అనంతవాసి కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఏ. గిరిధర్ సహకారం, అలాగే పూర్వపు రాష్ట్ర ప్రభుత్వ రహదారుల భవనాల కార్యదర్శి ఎంటి కృష్ణ బాబు, డిఆర్‌ఎం రమణారెడ్డి, సిబిఇ రామకృష్ణ, ఎన్‌హెచ్‌ఆర్‌ఒ ఎస్ కె సింగ్ తదితరులకు ఈ సందర్భంగా ప్రత్యేక కతజ్ఞతలను తెలుపుతున్నామన్నారు. దీంతో పాటుగా బళ్లారి చౌరస్తా నుంచి పిటిసి, టవర్ క్లాక్, సప్తగిరి కూడలి ,కలెక్టరేట్, పంగల్ రోడ్డు మీదుగా సమతాగ్రామ్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు 9.2 కిలోమీటర్ల మేరకు నాలుగు వరుసల రహదారి కూడా నిర్మించడం జరిగిందన్నారు. ఈ పనులను ఇప్పటికే 85 శాతం పూర్తి చేశామని మిగిలిన 15 శాతాన్ని జూలై నెలాఖరుకు పూర్తి చేస్తామని చెప్పారు. మరో మూడు నెలల్లో ఈ పనులన్నింటినీ పూర్తి చేసి కేంద్రమంత్రి గడ్కరీ,రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభిస్తామన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ఒకటిన్నర సంవత్సర కాలంలోనే ఈ నిర్మాణాలను చేపట్టి తనను ఆశ్చర్యానికి గురి చేశారన్నారు. ఇందుకు సంబంధించి పని చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ వసీం,డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్‌సిసంస్థ చైర్మన్ అమిలినేని సురేంద్రబాబులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కుశాల్ జైన్, నగరపాలక కార్పొరేటర్లు, ఎస్‌ఆర్‌సి ఇన్‌ప్రా డెవలపర్స్ ఎమ్‌డి రాజగోపాల్, డైరెక్టర్లు వెంకటేష్, మహీధర్ రెడ్డి,వారి సిబ్బంది, స్థానిక ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, తహశీల్దార్ శ్రీధర్ మూర్తి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.










