ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ టిడిపి హయాంలో చేసిన అనంతపురం అభివృద్ధిపై ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి సవాల్ విసిరారు. శనివారం నగరంలోని టిడిపి నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో జరిగిన అభివృద్ధి అంతా తమ హయాంలో జరిగిందంటూ ఎమ్మెల్యే అనంత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనంత అభివృద్ధిలో తనది చెరిగిపోని సంతకంలా నిలిచాయని తెలిపారు. ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అనంతపురం అభివృద్ధికి కషి చేశావా, కేంద్ర మంత్రులు ఎవరినీ కలవకుండా నగరానికి రోడ్లు ఎలా తెచ్చావని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కలిసి తెచ్చాడని చెబుతున్నావు.. నేను గతంలో కేంద్ర మంత్రిని కలిసి సుభాష్ రోడ్డు, గుత్తి రోడ్డుకు నిధులు కేటాయించాలని, అడిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను, రోడ్డు భవనాల శాఖ అధికారులు ఎస్టిమేషన్లు అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడిన విషయాలపై రికార్డులు ఉన్నాయని పరిశీలించుకోవాలన్నారు. సూర్యానగర్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, హౌసింగ్‌బోర్డ్ రోడ్డు, రాంనగర్ 80 ఫీట్ రోడ్ ఎవరి హయాంలో వచ్చాయో పక్కన ఉన్న చెట్లను అడిగినా చెబుతాయని తెలిపారు. సుభాష్ రోడ్డు వంకర టింకరగా ఎవరి కోసం ఏర్పాటు చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. నగరంలో ఓపెన్ జిమ్‌లు, శిల్పారామం, పీస్ మెమోరియల్ హాల్, డ్వాక్రా మహిళల కోసం కమ్యూనిటీ హాల్ లు, రుద్రంపేటలో అప్పర్ ప్రైమరీ స్కూల్, రాజీవ్ కాలనీ బ్రిడ్జి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సెంట్రల్ యూనివర్సిటీ, 6 వేల టిడ్కో ఇల్లు, రాజీవ్ కాలనీ ప్రజలకు వేల పట్టాలు, మరాఠీ కాలనీ, అండర్ డ్రెయినేజీ ఏర్పాటులో భాగంగా నగరానికి నీటి సదుపాయం కల్పించామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు కోసం హట్కో లోన్ అప్రువల్ కూడా చేయించామన్నారు. ఆధారాలతో సహా తన వద్ద ఉన్నాయని తెలిపారు. నీ హయాంలో మాత్రమే అభివృద్ధి చేశానని పదే పదే చెబుతున్నావు కాదా... చేసి ఉంటే చర్చకు రావాలన్నారు. నాలుగేళ్లలో ఎమ్మెల్యే చేసింది ఏమి లేదన్న విషయం ప్రజలకు తెలుసన్నారు. అభివృద్ధి చేసి చెప్పుకోవాలని, నీవు మాత్రమే చేశావు. ఎవరూ చేయలేదంటూ అసత్యాలు చెప్పడం సరికాదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గమనంలో పెట్టుకోవాలన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి










