Sep 14,2022 22:51

ఆన్‌లైన్‌ మోసగాళ్లు అరెస్ట్‌
సిమ్‌ కార్డులు, ఏటీఎంలు స్వాధీనం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
ప్రజల అత్యాసను ఆసరాగా చేసుకుని గిఫ్ట్‌ ఓచర్ల పేరుతో ఆన్లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల అంతరాష్ట్ర ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే వారి నుంచి భారీగా గిఫ్ట్‌ కార్డులు, ఓచర్లు, 30 సెల్‌ఫోన్లు, 30 ఏటిఎం కార్డులు, 2 లాప్టాప్‌లుతో పాటు రూ.1.80,000లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్‌ నేరానికి ఉపయోగించిన నకిలీ బ్యాంకు ఖాతాల పరిశీలన ద్వారా మరింత నగదు రికవరీ అయ్యే అవకాశముందని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఇటీవల ఆన్‌లైన్‌ ద్వారా ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయని, ఈ కేసులపై ప్రత్యేకశ్రద్ధ పెట్టి సదరు నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. డిఎస్‌పి సుధాకర్‌ రెడ్డి పర్యవేక్షణలో చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ నరసింహరాజు ఆధ్వర్యంలో పెనుమూరు ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌, సిబ్బందితో ప్రత్యేక బందాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్న నిందితుల తీరును విశ్లేషించి వారి కదలికలపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 6.30గంటలకు చిత్తూరు మేస్సనికాల్‌ గ్రౌండ్‌ సమీపంలో ఉన్న రిజర్వు ఫారెస్టు వద్ద ఐదుగురు అంతరరాష్ట్ర మోసగాళ్ళను గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో మోసగాళ్ళు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖేష్‌ కుమార్‌, సందీప్‌, కిరణ్‌, జైనోల్‌ అభి, హెచ్‌ఎన్‌.కిరణ్‌గా గుర్తించారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంలో ప్రావిణ్యం చెందని వారని మోసం చేయడానికి బందంగా ఏర్పడి ఆన్‌లైన్‌ ద్వారా, గిఫ్ట్‌కార్డుల ద్వారా, మోసపూరిత మాటల ద్వారా ఆన్‌లైన్‌లో బాధితుల ఫోన్‌ నెంబర్‌లు, అడ్రస్‌లు సేకరించి ముందస్తుగా తయారు చేసుకున్న పథకం ప్రకారం బాధితులను సంప్రదించి మోసం చేసి నగదును కాజేసేవారని తెలిపారు. ఈ విధంగా చిత్తూరు ఒకటవ, రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సుమారు 21మంది బాధితులు, కల్లూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒకరు, గంగాధర నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు బాధితులు, పూతలపట్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరికొందరు భాదితులు ఉన్నారన్నారు.
విచారణలో నేరస్తులు నకిలీ ఐడెంటిల ద్వారా దేశవ్యాప్తంగా అనేక బ్యాంకు ఖాతాలను తెరచి అమాయకులను మోసం చేసిన నగదును సదరు ఖాతాలలోకి పంపించి తద్వారా కాజేసినట్టు తెలిసిందన్నారు. వాటిని దర్యాప్తులో పరిశీలించడం ద్వారా అధిక మొత్తంలో నగదు రికవరీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
కారు వచ్చిందని లక్ష కాజేశారు..
చిత్తూరు కొండారెడ్డిపల్లికి చెందిన సంధ్య నాప్టాల్లో కొన్ని వస్తువులు ఆన్లైన్‌ ద్వారా బుక్‌ చేసింది. ఒక్కరోజ అజ్ఞాత వ్యక్తి నుండి మీరు కొనుగోలు చేసిన వస్తువుకు బహుమతి వచ్చింది. కారును ఉచితంగా అందిస్తున్నాం.. రవాణా ఖర్చులు, జీఎస్టీ, టాక్స్‌ల పేరుతో బ్యాంకు ఖాతా నెంబర్‌ ఇచ్చి అందులో మూడుసార్లు లక్షన్నర రూపాయలు జమ చేసింది. తనకు కారు బహుమతిగా వచ్చిందని ఫోన్‌చేసిన వ్యక్తికి అనేకసార్లు తిరిగి ఫోన్‌చేసిన ఎత్తకపోవడంతో అనుమానంతో చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆన్లైన్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రిషాంత్‌ రెడ్డి సూచించారు. అజ్ఞాత వ్యక్తులకు బ్యాంకు ఖాతా నెంబర్లు, ఏటీఎం పిన్‌ నెంబర్లు, ఓటిపి వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వరాదని అన్నారు. ఆన్లైన్‌ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉంటూ మోసాలకు గురైన బాధ్యతలు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. మోసపూరిత మాటలను నమ్మి మోసపోరాదన్నారు. నేరస్తులు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కావడంతో పట్టుకోవడం జరిగిందని. ఇతర దేశాల్లో ఉన్నవారైతే వారిని అరెస్టు అదుపులోకి తీసుకోవడం అత్యంత కష్టసాధ్యమని తెలిపారు.