ప్రసన్నమౌనికకు పోస్టల్ ఉద్యోగ సంఘాల నాయకుల సంఘీభావం
ప్రజాశక్తి - మొగల్తూరు
పోస్టల్ శాఖ రామన్నపాలెం గ్రామీణ సబ్ పోస్ట్ మాస్టర్ బి.ప్రసన్న మౌనిక పట్ల వేధింపులకు పాల్పడిన ఆ శాఖ పాలకొల్లు ఎఎస్‌పి అనిల్ అంబేద్కర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉద్యోగ వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రామన్నపాలెంలోని ఆ శాఖ కార్యాలయానికి ఎనిమిది కార్మిక సంఘాల నాయకులు వచ్చి బాధితురాలితో మాట్లాడి సంఘీభావం తెలిపారు. బాధితురాలు ఉద్యోగ విరమణ చేసే ఆలోచనను మానుకోవాలన్నారు. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గత నెల 23న కార్యాలయ సమయం ముగిసిన అనంతరం పాలకొల్లు ఎఎస్‌పి అనిల్ అంబేద్కర్ తనిఖీకి వచ్చి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపారు. దీంతోపాటు కార్యాలయంలోని రూ.25 వేల నగదు తనతో తీసుకువెళ్లారని తెలిపారు. దీంతో ఆమె ఆందోళనకు గురై మరుసటి రోజు భీమవరంలోని ఎస్‌పి బాలసుబ్రమణ్యంకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న అనిల్ అంబేద్కర్ మద్దతు దారులను బాధితురాలి ఇంటికి పంపి ఆమెను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. అంబేద్కర్ తనతో తీసుకువెళ్లిన రూ.25 వేల నగదులో రూ.20 వేలు సీతారామపురం సబ్ పోస్టాఫీస్‌లో జమ చేశారన్నారు. పాలకొల్లులోని ఎఎస్‌పి గతం నుంచి కూడా ఆ శాఖలోని పలువురు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికంగా వేధించారని ఆరోపించారు. దీనిపై పోస్టల్ శాఖ రాష్ట్ర జాతీయ స్థాయి ఉన్నతాధికారులకు తాము కూడా ఫిర్యాదు చేశామన్నారు. వెంటనే చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆల్ ఇండియా పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ అధ్యక్షులు డివి.రావు, పలు సంఘాల నాయకులు బి.శ్రీధర్‌బాబు, ఎం.తిరుమలరావు, యువి.రామకృష్ణ, ఎస్.నాగేశ్వరరావు, పలు సంఘాల నాయకులు ఉన్నారు. దీనిపై ఆ శాఖ భీమవరం ఎస్‌పి బాలసుబ్రమణ్యంను వివరణ కోరగా నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.










