చోద్యం చూస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి జెడిఆర్ విమర్శలు
ప్రజాశక్తి- పిచ్చాటూరు : మండలంలోని ఎస్‌ఎస్‌బి పేట పంచాయతీ పరిధిలో అనధికార రిచ్ ఏర్పాటు చేసి అక్రమార్కులు ఇసుక అక్రమరవాణాకు పాల్పడుతున్నారని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జె.డి.రాజశేఖర్ విమర్శించారు. శుక్రవారం ఆయన గ్రామస్తులతో కలసి టిడిపి నాయకులు ఇసుక రీచ్‌ల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్.ఎస్.బి పేట పంచాయతీ లో ఇసుక రిచ్ మంజూరు చేసినట్లు ఎటువంటి అనుమతులు లేకున్నా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు అండతో అరనియర్ నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక రవాణాకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే యథేచ్ఛగా ఇచ్చిన ఇసుక రిచ్‌లో అనుమతులకు మించి ఇసుక రవాణా చేస్తున్నా మైనింగ్ శాఖ అధికారులు నిమ్మనిరెత్త్తినట్లు మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ఇసుక రిచల్లో ఎటువంటి యంత్రాలు లేకుండా 10 నుంచి 15 అడుగులలోపు ఇసుక తరలింపుకు అనుమతులు తీసుకొని 40 అడుగుకు వరకు యంత్రాలతో ట్రిపర్లకు లోడింగ్ చేస్తూ తమిళనాడు తరలిస్తూ అక్రమార్కులు కోట్లకు పడగలు ఎత్తుతున్నారని చెప్పారు. అనుమతులకు మించి ఇసుక తరలించడంతో పర్యావరణ సమతుల్యత లోపించి భూగర్భజలాలు ఇంకిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు పంట పొలాలుకు నీరు అందక నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారని అన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో జిల్లా స్థాయి టీడీపి బందం నిరసన దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు అడహక్ కమిటీ సభ్యడు తిరుమల రెడ్డి, కె.సతీష్ నాయుడు రమణయ్య నాయుడు, మురళి, చంద్రారెడ్డి, సుబ్రమణ్యం, ఎలుమలై, దనంజేయలు, ఢిల్లీ రెడ్డి, రజని, జెన్నిఫర్, శివయ్య, ఎస్‌ఎస్‌బి పేట గ్రామస్తులు పాల్గొన్నారు.










