అంటువ్యాధుల విజృంభణ..!
- ముసురు వానలతో పారిశుధ్యం - పడక పెరుగుతున్న డెంగ్యూ కేసులు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
వరుసగా కురుస్తున్న వర్షాలకు జిల్లా మొత్తం రొచ్చురొచ్చుగా మారుతోంది. గ్రామీణ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం పడకేసింది. దీంతో అంటు వ్యాధులు పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎక్కువగా విషజ్వరాలు పెరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా విషజ్వరాలు స్వైర విహారం చేస్తున్నాయి. అధికారులు ఓ లెక్క చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మరిన్ని ఎక్కువగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో నిధుల కొరత
పంచాయతీల్లో పారిశుధ్యం పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ప్రభుత్వం ఇతర ఖర్చులకు మళ్లించడం ద్వారా గ్రామాలన్నీ విలవిలలాడుతున్నాయి. హరిత రాయబారులకు కనీసం నెలనెలా వేతనాలు కూడా రావడం లేదు. బ్లీచింగ్, సున్నం, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు నిధుల్లేకుండా పోయాయి. ఫాగింగ్ యంత్రాలను ఆయా పంచాయతీలకు సరఫరా చేశారు. గానీ వాటికి కావాల్సిన రసాయనాలు కొనుగోలు చేసేందుకు, పిచికారీ చేయడానికి కూలీ డబ్బులు కూడా లేని పరిస్థితి నెలకుంది. దీంతో పారిశుధ్యం జాడ లేకుండా పోయింది. దీంతో జబ్బులు స్వైర విహారం చేస్తున్నాయి. జనం జ్వరాలతో మంచం పడుతున్నారు.
పెరుగుతున్న జ్వర బాధితులు
వరుసగా కురుస్తున్న వర్షాలకు దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో విషజ్వరాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఏడు మలేరియా కేసులు నమోదయ్యాయి. అలాగే 269 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా వాతావరణ పరిస్థితులు కలుషితం కావడం వల్ల 8689 మందికి డయేరియా, 976 మందికి టైఫాయిడ్ సోకింది. ఇది ఒక్క ప్రభుత్వాసుపత్రుల్లో నమోదైన కేసులు మాత్రమే. ఇక ప్రయివేటులో నమోదైన కేసుల సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుందనేది అంచనా.
పారిశుధ్య చర్యలు తీసుకుంటాం :లక్ష్మీ, డిపిఓ
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు తీసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ ఫాగింగ్ జరిపిస్తున్నాం. వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం.










