
* ప్రారంభమే తప్ప ముగింపు లేని రిజర్వాయర్
* 16 ఏళ్ల కిందట ప్రారంభం
* నేటికీ 45 శాతం పనులు పూర్తి
* ప్రకటనలకే పరిమితమైన సాగు, తాగునీరు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి
ఆఫ్‌షోర్ పనులు ప్రారంభ సంవత్సరం తప్ప ముగింపు చెప్పలేని పరిస్థితి నెలకొంది. రిజర్వాయరు పనులు ప్రారంభమై 16 ఏళ్లు పూర్తయినా నేటికీ 50 శాతం పనులు కూడా కాలేదు. 2007లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు మొదలయ్యాయి. ఏడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నా పనులను మాత్రం నాటి ప్రభుత్వం పూర్తి చేసుకోలేకపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి తన ఐదేళ్ల కాలంలో కనీసం 40 శాతం పనులనూ పూర్తి చేయలేకపోయింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా రిజర్వాయర్ పనులు కనీసం 50 శాతం కూడా పూర్తి కాలేదు. అధికారంలోకి వచ్చిన పాలకపక్షాలు అదిగో, ఇదిగో సాగునీరంటూ రైతులను మభ్యపెట్టడం తప్ప రిజర్వాయర్ పూర్తి చేయడంపై చిత్తశుద్ధి కనబరచడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
టెక్కలి, నందిగాం, పలాస, మెళియాపుట్టి మండలాల్లోని 24,600 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఆఫ్‌షోర్ రిజర్వాయరు ప్రాజెక్టును ప్రారంభించింది. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌విఇసి-ఇందు సంస్థతో రూ.123.25 కోట్లతో ఫిబ్రవరి 18, 2007లో ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం 2008 జనవరి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. భూసేకరణ పనులు సకాలంలో కాకపోవడం, ప్రభుత్వం పెద్దగా దృష్టిసారించకపోవడంతో 2014 వరకు పనులు ప్రారంభం కాలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం, రిజర్వాయర్ పనులను మళ్లీ అదే సంస్థకు అప్పగించింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరించి రూ.466.28 కోట్లకు పెంచింది. ప్రాజెక్టు పనుల పూర్తికి జూలై 7, 2019 వరకు గడువిచ్చింది. టిడిపి ప్రభుత్వం అధికారం కోల్పోయిన నాటికి 38 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
నాలుగున్నరేళ్లలో ఏడు శాతమే పనులు
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత నిర్మాణ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. మిగిలిన పనులకు సంబంధించి కొత్త రేట్లతో రూ.855 కోట్ల అంచనా వ్యయంతో 2021 సెప్టెంబరులోనే అధికారులు ప్రతిపాదనలు పంపారు. గతేడాది సెప్టెంబర్ 14న సవరించిన అంచనాల మేరకు రూ.852.45 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మంజూరు చేసిన మొత్తంలో రూ.299.67 కోట్లను సంబంధిత నిర్మాణ సంస్థ సాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ అండ్ కంపెనీ కేటాయించారు. ఇప్పటివరకు 45 శాతం పనులు మాత్రమే జరిగాయి. అంటే నాలుగున్నరేళ్లలో ఏడు శాతమే పనులు చేపట్టారు. కాలువ తవ్వకాలకు అవసరమైన భూమిని అధికారులు సేకరించినా వాటికి డబ్బులు ఇవ్వలేదు. కాలువ తవ్వకాలకు 49.88 ఎకరాలకు రూ.7.04 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూసేకరణకు డబ్బులు చెల్లిస్తే గానీ పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది అక్టోబరు నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది.
పనులు పూర్తి 45 శాతమే
రిజర్వాయర్ పనులు ప్రస్తుతం 45 శాతం మేర జరిగాయి. మట్టి పనులు 83,31,000 క్యూబిక్ మీటర్ల మేర చేపట్టాల్సి ఉండగా, 42,36,527 క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. ఇంకా 40,94,473 క్యూబిక్ మీటర్ల పని మిగిలి ఉంది. కాంక్రీట్ పనులు 1,31,544 క్యూబిక్ మీటర్లు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 2,457 క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. మరో 1,29,087 క్యూబిక్ మీటర్ల పని పెండింగ్‌లో ఉంది.
పనులు 45 శాతం... ఖర్చు 70 శాతం
రిజర్వాయరు పనులు ఇప్పటివరకు 38 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఖర్చుల విషయంలో మాత్రం గత టిడిపి ప్రభుత్వం ఎక్కడా తగ్గలేదు. రిజర్వాయర్ నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.123.25 కోట్ల నుంచి రూ.466.28 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. అందులో రూ.325.45 కోట్లను వెచ్చింది. అంటే 70 శాతం మేర ఖర్చు చేసింది.
పెరిగిన ఆర్ అండ్ ఆర్ ఖర్చు
ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.123.25 కోట్లతో ప్రారంభమయ్యాయి. 2014 అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం అంచనా వ్యయాన్ని అమాంతం రూ.466.28 కోట్లకు పెంచింది. అందులో రూ.325.45 కోట్లను ఖర్చు చేసింది. ఇప్పుడు తాజాగా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.123.25 కోట్ల నుంచి రూ.855 కోట్లకు చేరింది. ఇప్పటివరకు రూ.325.45 కోట్లను ఖర్చు చేయడంతో మరో రూ.529.55 కోట్లను కేటాయించాల్సి వచ్చింది.
వచ్చే ఏడాది అక్టోబరు నాటికి పూర్తి
ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. కొత్త టెండర్లను దక్కించుకున్న సంస్థ పనులు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది అక్టోబరు నాటికి పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం.
- డోల తిరుమలరావు, వంశధార సర్కిల్ ఎస్‌ఇ