Dec 10,2022 22:38

విలేకర్ల సమావేశంలో నిందితులను చూపుతున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి, దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ము, వెండి, నగదు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
రూ.55 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌

ఇటీవల గంగాధరనెల్లూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో పాన్‌బ్రోకర్‌ షాపులో జరిగిన భారీ దొంగతనం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు చేధించారు. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో చిత్తూరు రూరల్‌ ఈస్ట్‌ సీఐ మద్దయాచారి నేతృత్వంలో ఎస్సైలు అనిల్‌కుమార్‌, ప్రతాప్‌రెడ్డి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఒకటిన్నర నెలగా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో తిరిగి నేరస్తులకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఈ క్రమంలో శుక్రవారం అందిన సమాచారం మేరకు.. చిత్తూరు ఈస్ట్‌ సీఐ ఆధ్వర్యంలోని టీమ్‌ చిత్తూరు మండలం బెంగళూరు-తిరుపతి రోడ్డులోని చెర్లోపల్లి వద్ద కేసులో ముద్దాయిలుగా ఉన్న మురుగన్‌, శివగురు, కరాటే మురుగా, రాజాలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 లక్షల నగదు, 395 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి, నేరానికి ఉపయోగించిన 3 కార్లను మొత్తం రూ.55 లక్షలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు ముద్దాయిలు కలిసి గత 15 ఏళ్లగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులు, పాన్‌బ్రోకర్‌ దుకాణాలు, నగల దుకాణాలు, ఒంటరి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడి భారీ మొత్తాలను చోరీ చేస్తూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్నారు. వీరిలో కరాటే మురుగా తన స్థావరాన్ని ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని బందంతో కలిసి నేరాలకు పాల్పడి తిరిగి అక్కడకు వెళ్లి తలదాచుకొనేవాడు. వీరిపై నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 42 కేసులు నమోదై పెండింగ్‌లో ఉన్నాయి. వీరు గతంలో చిత్తూరు టౌన్‌, ఐరాల పొలీసు స్టేషన్‌ పరిధిలో చోరీలకు పాల్పడినట్లు తేల్చారు. తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా మధురాంతకం తాలూకా వైపాన గ్రామానికి చెందిన మురుగన,్‌ శివగురు, కరాటే మురుగా, రాజాలను అరెస్టు చేయగా.. కల్లకురుచ్చికి చెందిన మణికంఠ, నల్ల మురుగా, కర్ణాటకలోని తుంకూర్‌ జిల్లాకు చెందిన సురేష్‌, సిరా, పాండిచ్చేరికి చెందిన రంజిత్‌, తమిళనాడులోని కల్లకురుచ్చికి చెందిన సెల్వరాజ్‌, పయని, వెంకటేష్‌, పెరుమాల్‌లు పరారీలో ఉన్నారు. అత్యంత చాకచక్యంగా కేసును ఛేందించిన చిత్తూరు రూరల్‌ ఈస్ట్‌ సీఐ మద్దయాచారి, ఎస్సై అనిల్‌ కుమార్‌, ప్రతాప్‌ రెడ్డి, ఐడీ పార్టి సిబ్బందిని జిల్లా ఎస్పీ రిశాంత్‌ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి క్యాష్‌ రివార్డులు అందించారు.