Jul 31,2022 21:33

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌
292 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50 వేలు నగదు రికవరీ
కర్ణాటకకు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలతో పాటు ఇద్దరు మహిళలు అరెస్ట్‌
కేసులను చేధించిన పోలీసులను అభినందించిన పలమనేరు డీఎస్పీ గంగయ్య
ప్రజాశక్తి - కుప్పం:
మండలపరిధిలో గడిచిన మూడేళ్లలో జరిగిన మూడు దొంగతనాలకు సంబంధించి ఐదుగరు దొంగలను అరెస్టు చేసి రూ.14,01,600లు విలువచేసే 292 గ్రాములు బంగారు ఆభరణాలతో పాటు రూ.50వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు పలమనేరు డీఎస్పీ గంగయ్య తెలిపారు. ఆదివారం కుప్పం సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చిత్తూరు ఎస్పీ రిశాంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు దొంగతనాలను అదుపు చేసి, జరిగిన దొంగతనాల్లో రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. కుప్పం పట్టణంలోని జర్నలిస్ట్‌ కాలనీ, నార్త్‌ ప్యాలెస్‌ రోడ్‌, గుడ్ల నాయనపల్లి గ్రామాల్లో జరిగిన దొంగతనాలకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంకు కోలారుకు చెందిన చంద్రప్ప, బెంగళూరుకు చెందిన నాగరాజు, మునిరాజుతో పాటు గుడ్లనాయనపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ, మునిలక్ష్మీలను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుండి నగదు, నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరీ కేసులను చేధించిన కుప్పం అర్బన్‌ సీఐ శ్రీధర్‌, ఎస్సైలు శివకుమార్‌, రామలక్ష్మి రెడ్డి, క్రైమ్‌ పార్టీ శ్రీనివాసులు, ప్రకాష్‌, అల్లావుద్దీన్‌, నటరాజ్‌, అరుణాచలం, బాలాజీలను అభినందిస్తూ రివార్డులను అందజేశారు.