Apr 25,2023 22:18

అంతర్గత రహదారి పనులను పరిశీలిస్తున్న మేయర్‌ మొహమ్మద్‌ వసీం

         అనంతపురం కార్పొరేషన్‌ : నగరంలోని అంతర్గత రహదా రుల విస్తరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మేయర్‌ మొహమ్మద్‌ వసీం తెలిపారు. మంగళవారం నగరంలోని లక్ష్మీనగర్‌ నాగల కట్ట వద్ద రూ.1.20 కోట్లతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను మేయర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా సిఎం జగన్‌ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులు, డ్రెయినేజీలు, కల్వర్టుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అంతేగాకుండా నగర చరిత్రలోనే తొలిసారిగా నగరాభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్‌ రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో చేసే పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తయిందని త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధు, ఖాజా, రఫీ, ఎఇ శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.