Oct 26,2022 21:31

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
రూ.50లక్షలు విలువ చేసే ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠ గుట్టు రట్టు చేసి ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండీ రూ.50 లక్షల విలువ చేసే ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డిఎస్‌పి సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు... బుధవారం చిత్తూరు వెస్ట్‌ సిఐ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో గుడిపాల ఎస్‌ఐ రాజశేఖర్‌ పోలీస్‌ సిబ్బంది ఎంసిఆర్‌ క్రాస్‌ చెన్నై- బెంగుళూరు హైవే రోడ్డు వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఉదయం ఆరుగంటల సమయంలో చిత్తూరు వైపు నుండీ మూడు ద్విచక్రవాహనాల్లో ఏడుగురు వ్యక్తులు పోలీసులు కంట పడ్డారు. పోలీసులను గమనించిన దుండగులు ద్విచక్రవాహనాలను పోలీసులు ఆపుతున్నా అపకుండా వేగంగా తప్పించుకొనే ప్రయత్నం చేశారు. దీంతో గుడిపాల ఎస్‌ఐ రాజశేఖర్‌, పోలీస్‌ సిబ్బంది వెంబడించి ద్విచక్రవాహనాల్లో ప్రయాణం చేస్తున్న సతీష్‌, రాజీవ్‌ గాంధీ, గోకుల్‌ కన్నన్‌, యువరాజ్‌, హరి, ఆకాష్‌, బాలను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరంతా తమిళనాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠగా గుర్తించి వారి వద్ద నుండీ మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకొని పట్టుబడ్డ నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వివిధ ప్రాంతాల్లో దొంగలించిన 40ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ రూ.50లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. పట్టుబడ్డ నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న గుడిపాల ఎస్‌ఐ రాజశేఖర్‌, వారి సిబ్బందితో పాటు ఐడి పార్టీ సిబ్బందిని డిఎస్‌పి సుధాకర్‌రెడ్డి అభినందించారు.