Jul 27,2022 22:03

అంతరాష్ట్ర దొంగ అరెస్ట్‌
బంగారు ఆభరణాలు స్వాధీనం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ఇటీవల వరుసగా చిత్తూరు, కార్వేటినగరంసర్కిల్‌ పరిధిలో నమోదైన వరుస దొంగతనలు, చైన్‌ స్నాచింగ్‌ కేసులను చేధించుటకు చిత్తూరు జిల్లా ఎస్‌పి రిషాంత్‌రెడ్డి, చిత్తూరు డిఎస్‌పి సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో చిత్తూరు ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్‌ నరసింహరాజు, చిత్తూరు రూరల్‌ ఈస్ట్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ బాలయ్య, కార్వేటినగరం సర్కిల్‌ఇన్స్పెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ వారితో ప్రత్యేక బందాలు ఏర్పరచి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాచరణంలో భాగంగా రాబడిన పక్కా సమాచారం మేరకు చిత్తూరు పట్టణంలో దొంగాతనాలకు పాల్పడుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ అంతరాష్ట్ర దొంగ తిరువీధుల మహేష్‌ను చిత్తూరు రిజర్వు ఫారెస్ట్‌లో 26వ తేది మంగళవారం ఉదయం 7గంటలకి పట్టుకోవడం జరిగింది. విచారణలో సదరు నేరస్తుడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రలలో సుమారు 150కి పైగా దొంగాతనాలు చేసి కేసులు ఉన్నట్టు ఒప్పుకున్నారు. అనంతరం అతని నుంచి చోరి సొత్తుగా ఉన్న సుమారు 400 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈదర్యాప్తులో ముద్దాయి చోరి చేసే విధానంలో విస్తుగొలిపే విషయాలు వెల్లడించడం జరిగింది. తిరువీదుల మహేష్‌ (33) తండ్రి పేరు లేట్‌ చెన్న కేశవులు, బాబాయి గుంట, సీతానగర్‌, గుంటూరు టౌన్‌. ఇతడు విలాసాల కోసం దొంగతనాలు చేయడం ఒక వ్యసనంగా మార్చుకుని, ఒంటరిగా ఉన్న ఇల్లు, తాళం వేసిన ఇళ్ళను ఎంచుకొని రెక్కి నిర్వహించి పథకం ప్రకారం చోరీలకు పాల్పడేవాడని జిల్లా ఎస్‌పి రిషాంత్‌రెడ్డి తెలిపారు. దొంగిలించిన సొత్తుతో విలాసవంతమైన జీవితం గడిపేవాడని పోలీస్‌లు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించిన తరువాత జైలు నుంచి విడుదలైన వెంటనే మరల దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్నట్లు చెప్పారు. తిరువీదుల మహేష్‌ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం 4, గుంటూరురూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ 9, కష్ణ జిల్లా 1, కర్నూలు 2, విజయవాడ అర్బన్‌ 4, గుంటూరు 4, అనంతపురం 2, తిరుపతి అర్బన్‌ 1, గుంటూరు 4, నెల్లూరు 1 తెలంగాణా రాష్ట్రంలో మహబూబ్‌ నగర్‌ 3, సిద్దిపేట్‌ 8, ఖమ్మం 3, సంగారెడ్డి 2 కేసులున్నట్లు తెలిపారు. కార్వేటినగరం పరిధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముద్దాయి చలంపాల్యం నాగరాజుని 27వ తేదీ ఉదయం 6.30 గంటలకు కార్వేటినగరం మండలం, చింతమండి క్రాస్‌ వద్ద అరెస్ట్‌ చేయడమైనది. ఇతని వద్ద నుండి కేసులలో సంబంధించిన 4 బంగారు మాంగళ్యం చైన్‌లు బరువు సుమారు 108 గ్రాములు, ఒక మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈకేసులో చలంపాల్యం నాగరాజు (27) తండ్రి లేట్‌ ఎలుమలై, గుండుగాని హరిజనవాడ ఏమిట్టకండ్రిగ గ్రామం, యం.యం.విలాసం పంచాయతీ. కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా చలంపాల్యం నాగరాజు అను అతను పొలాలలో ఉన్న ఒంటరి వద్ద మహిళలను గుర్తించి వారిని భయపెట్టి, కొట్టి వారి మెడలోని బంగారు చైన్‌లను దొంగతనం చేసే అలవాటు కలవాడు. ఇతని పై 4 కేసులున్నట్లు ఎస్‌పి తెలిపారు. చిత్తూరు జిల్లాలో పాటు ఇతర ప్రాంతాల్లో పలు చోరీ కేసుల్లో ముద్దయిలైన ఇద్దరిన్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్‌పి రిషాంత్‌రెడ్డి తెలిపారు.