Aug 05,2022 22:18

బొప్పాయి పంటలో అంతర్‌పంటగా బంతిపూలసాగు

ప్రజాశక్తి - గంగవరం
వ్యవసాయంలో నష్టపోతున్న అన్నదాతకు, అంతర పంటలు వేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారుల సూచనలు... అయితే అంతర పంటలు వేసినా వానొచ్చిందంటే రెండు పంటలూ కొట్టుకుపోతున్నాయని, పైసా ఆదాయం ఉండటం లేదని, ఉద్యానవన పంటలని ప్రభుత్వం సైతం నష్టపరిహారం చెల్లించడం లేదని రైతులు వాపోతున్నారు.
అంతర పంటలు వేస్తే ఒక పంట ఆదాయం లేకపోయినా, వేరే పంటలో అయినా ఆదాయం వస్తుందన్న ఆశతో కొంతమంది రైతులు మొగ్గుచూపారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి పంచాయతీకి చెందిన రైతు ఎ.వెంకటరెడ్డి తనకున్న రెండు ఎకరాల పొలంలో బొప్పాయి పంట వేసి, బంతిపూలు సాగు చేశారు. అయినా ఆదాయం రాకపోవడంతో నిరాశతో పంటను వదిలేశాడు. బొప్పాయి మొక్క ఆరు రూపాయల చొప్పున రెండు ఎకరాలకు ఆరువేల మొక్కలు నాటాడు. అందులో బంతిపూలు అంతర పంటగా వేశాడు. ఎకరాకు ఎరువులు, దున్నకాలు, కూలీలు మొత్తం కలిపి లక్షా 80వేలు ఖర్చయ్యింది. అయితే బంతిపూల పంట బాగా ఉన్నా ధర లేకపోవడంతో గిట్టుబాటు కాలేదు. బొప్పాయి మార్కెట్లో కిలో 30 పలుకుతుండగా, రైతులకు కేవలం 8-10 మాత్రమే పలుకుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటల దళారులకే లాభం తెచ్చి పెడుతోందని రైతులు వాపోతున్నారు. పంటలు పండి గిట్టుబాటు కాని పరిస్థితి ఓ వైపు ఉంటే, ఇటీవల కురిసిన జడివానకు బంతిపూల మొక్కల తేమ శాతం ఎక్కువై చనిపోయాయి. బొప్పాయి మొక్కలు ఎరుపు తిరిగి పూత, కాయలు రాలిపోతున్నాయి. క్రిమి సంహారక మందులు కొట్టినా ప్రయోజనం లేదని వాపోయాడు. గతంలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి బోర్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి నష్టపోయామని, ప్రస్తుతం భూగర్భజలాలు పుష్కలంగా ఉండి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉద్యానవన పంటలకూ పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.