
* టిడిపి జిల్లా అధ్యక్షుడు రవికుమార్
ప్రజాశక్తి- ఆమదాలవలస: నీతికి, నిజాయితీకి, ధర్మానికి, అదర్మానికి జరుగుతున్న పోరాటంలో అంతిమ విజయం చంద్రబాబుదేనని టిడిపి జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూన రవికుమార్ అన్నారు. పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద ఆమదాలవలస మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు 'నేను సైతం బాబు కోసం' ఆదివారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి టిడిపి మండల అధ్యక్షుడు నూక రాజుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తి కనుకనే సుప్రీం కోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారని అన్నారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి అవినీతి ఆరోపణ కేసుల్లో ఒక్కసారైనా దాఖలు చేశారా? అని ప్రశ్నించారు. నీతిపరుడుకు, అవినీతిపరుడుకు అదే తేడా అని అన్నారు. న్యాయం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుందన్నారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. రెండు మూడు రోజుల్లో చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, రామన్న ఎన్నికల్లో వైసిపి ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు. కార్యక్రమం లో టిడిపి నాయకులు సనపల డిల్లేశ్వరరావు, తమ్మినేని సుజాత, చంద్రశేఖర్, బోనెల అప్పారావు, సర్పంచ్‌లు సనపల చెల్లంనాయుడు, బొడ్డేపల్లి గౌరీపతిరావు, గొండు రమణ, చేపేన సత్తిరాజు, ఎండ అప్పలనాయుడు పాల్గొన్నారు.