May 14,2022 22:34

ఆంక్షల అమ్మకాలు
అనుమతులున్న వ్యాపారులకి మాత్రమే నల్లబెల్లం విక్రయించాలి : ఎస్పీ
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌:

నాటుసారా తయారీకి నల్లబెల్లం తరలిపోతోందంటూ పోలీసులు మరోమారు నల్లబెల్లం తయారీపై ఆంక్షలు పెడుతున్నారు. నల్లబెల్లం తయారు చేసే రైతులు జిల్లాలో బెల్లం కొనుగోలు లైసెన్స్‌ను కలిగిన వ్యాపారులకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని సూచించారు. నాటుసారా తయారీని అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పీడీ యాక్టులు పెట్టందుకు సైతం వెనకాడటం లేదు. ఈ క్రమంలో నాటుసారా తయారీల్లో కీలకంగా ఉపయోగించే నల్లబెల్లం తాయారీపై పోలీసుశాఖ ఆంక్షలుపెడుతూ జిల్లాలోని నల్లబెల్లం తయారు చేసే రైతులు, బెల్లం కొనుగోలు చేసే వ్యాపారులకు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కొన్ని నిబంధనలు పెట్టారు. ఇందులో
1. ప్రతి రైతుల లైసెన్స్‌ కలిగిన వ్యాపారికి మాత్రమే బెల్లం అమ్మాలి.
2. లైసెన్స్‌ కలిగిన బెల్లం వ్యాపారి తాను కొనుగలో చేస్తున్న నల్లబెల్లం క్రయ,విక్రయాల జాబితాను అండుబాటులో ఉంచుకోవడంతో పాటు ఎవరి విక్రయిస్తున్నాడనే వివరాలు ఎప్పుటికప్పుడు పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది.
3. నాటుసారా తయారు చేస్తూ పట్టుబడ్డ వ్యక్తులకు నల్లబెల్లం ఎక్కడి నుంచి ఏవ్యాపారి నుంచి లభించిందో గుర్తించి నల్లబెల్లం సరఫరా చేసిన వ్యాపారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు.
నిండా మునిగిన చెరకు రైతులు
గతంలో సహకార రంగంలో రెండు, ప్రైవేటు, షుగర్‌ ఫ్యాక్టరీలు నాలుగు, ఉమ్మడి జిల్లాలో ఆరు షుగర్‌ ఫ్యాక్టరీలు నడిచేవిజ ప్రసుత్తం నెలవాయి గ్రామంలోని ఎస్‌ఎన్‌జే ఫ్యాక్టరీ మాత్రమే ఈసీజన్‌లో చెరకు క్రషరింగ్‌ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుసుస్తోంది. దీంతో జిల్లాలో పండించిన చెరకు ఎక్కడ అమ్ముకోవాలో దిక్కుతొచక పక్క రాష్ట్రాలకు జిల్లాలో పండిన చెరకను తరలించాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా చిత్తూరు, తిరుపతి, అన్నమ్మ జిల్లాల్లో 9.500 హెక్టార్ల విస్తీర్ణంలో చెరకు పండుతోంది. ఒక్క హెక్టారుకు 80టన్నుల ఉత్పత్తి లభించే అవకాశముంది. షుగర్‌ ఫ్యాక్టరీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు బెల్లం తయారీకి పూనుకోవాల్సి వస్తోంది. నల్లబెల్లంపై పోలీసుల ఆంక్షలతో తాము తయారు చేసిన నల్లబెల్లం లైసెన్స్‌ కలిగిన వ్యాపారులు ఎక్కడున్నారో... గుర్తించి అమ్ముకోవాల్సి ఉంటుంది. మరో వైపు మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు సిండికేట్‌గా మారి మామిడి ధరలను అదుపు చేస్తున్న తరహాలో లైసెన్స్‌లు కలిగిన బెల్లం వ్యాపారులు సిండికెట్‌గా మారి ధరలను అదుపు చేసే ప్రమాదం లేకపోలేదు.
బెల్లం పై ఆంక్షలేమిటి..
రైతు పండించే పంటకు గుట్టుబాటు ధరకల్పించలేని ప్రభుత్వం సాటుసారా తయారీ అరికట్టే పేరుతో నల్లబెల్లంపై ఆంక్షలు పెట్టడం ఏమిటి. దీని వల్ల బెల్లం రైతులు ఇబ్బందిపడే అవకాశముంది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేస్తున్న బెల్లం స్థానికంగా ఉండే చిరు వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు లైసెన్స్‌ కలిగిన వ్యాపారిని వెతుకొవడం సాధ్యమేనా... నాటుసారా తయారీని అరికట్టేందుకు ఉన్న మార్గాలను అన్వేషించకుండా బెల్లంతయారీ, విక్రయాలపై ఆంక్షలు పెట్టడం సరికాదు.
-గోవిందస్వామి, చెరకు రైతు, సెట్టేరిపల్లి, ఐరాల మండలం
రైతులకు వచ్చే ఇబ్బంది ఏమిలేదు..
లైసెన్స్‌ కలిగిన వ్యాపారులకు నల్లబెల్లం అమ్మకోవాలనే ఆంక్షల్లో బెల్లం తయారీ రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు విచ్చలవిడిగా ఎంత నల్లబెల్లం తయారు చేస్తున్నారు. ఎక్కడ అమ్మతున్నారు.. అనే విషయం స్పష్టంగా తెలిసే అవకాశముంది. నాటుసారా తయారీ అరికట్టేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నల్లబెల్లం అమ్మకాలపై ఆంక్షలు. మరో వైపు గ్రామీణ ప్రాంతాల్లో రైౖతులు తయారు చేసే బెల్లం అక్కడే విక్రయించే అవకాశాలు ఎక్కువ.
- జాన్‌విక్టర్‌, క్రేన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌
నాటుసారా అరికట్టేందుకే..
జిల్లాలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపి అరికట్టేందుకు ఉన్న మార్గాలను పోలీసుశాఖ అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా అమ్మకాలపై ఆంక్షల పెట్టాం. ముఖ్యంగా సారా తయారీదారులకు నల్లబెల్లం అందకుండా చేయాలనేదే పోలీసుశాఖ ఉద్యేశం. వ్యాపారులు పక్కాగా క్రయ,విక్రయాలను రికార్డులతో సహా పోలీసులు ఎప్పుడు అడిగితే అప్పుడు చూపాల్సి ఉంటుంది. నాటుసారా స్థావరాలపై దాడుల సందర్భంగా పట్టుబడ్డ బెల్లం ఏ వ్యాపారి నుంచి కొనుగోలు చేశాడనే విషయాన్ని పక్కా ఆధారాలతో తెలిస్తే వ్యాపారిపై చట్టపరం కేసు నమోదు చేయడం జరుగుతుంది. - సుధాకర్‌రెడ్డి, చిత్తూరు డిఎస్పీ