May 09,2023 21:41

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : మహిళల్లో రక్తహీనత, బాలబాలికల్లో పౌష్టికాహార లోపం, బాల్య వివాహలు-టీనేజీ ప్రెగెన్సీలు వంటి అనేక సామాజిక సమస్యలపై విజయం సాధించడానికి అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే ఏకైక మార్గమని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పాలన వికేంద్రీకరణ యుగంలో క్షేత్ర స్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. అందుకు తగ్గట్టుగానే అంగన్‌వాడీల నిర్వహణ సైతం ఉండాలన్నారు. అంగన్‌వాడీల్లో పరిశుభ్రమైన వాతావరణం కనిపించాలన్నారు. తల్లులు, పిల్లలకు వ్యక్తిగత శుభ్రత ప్రాధాన్యత తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగెన్సీల నివారణకు కౌమార దశలో ఉన్న యువత లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాల్య వివాహాల నివారణలో పోలీసులు, అధికారులతో పాటూ ప్రజాప్రతిథుల సహకారం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, జిల్లా బాలల పర్యవేక్షణ అధికారి సుబ్రమణ్యం, సీడీపీవోలు, ఏసీడీపీవోలు పాల్గొన్నారు.
సాంకేతికత, సమన్వయంతోనే రహదారి భద్రత : కలెక్టర్‌
ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవడంతో పాటు వివిధ శాఖల మధ్య సమన్వయంతో రహదారి భద్రత మెరుగుపరచవచ్చని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా రహదారి భద్రత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్ల మీద వేగం పెరిగిందని, చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, ఆ నిర్లక్ష్యం అధికారుల వైపు నుంచి ఉండకూడదన్నారు. ఐరాడ్‌ యాప్‌లో రోడ్డు ప్రమాదాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం వల్ల రహదారి భద్రత కోసం మెరుగైన ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంటుందన్నారు. సీసీ కెమెరాల అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ శివరామప్రసాద్‌, అడిషనల్‌ ఎస్పీ నాగేంద్రుడు, రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ ఓబుల్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ కష్ణవేణి, పంచాయతీ రాజ్‌ శాఖ, జాతీయ రహదారుల అథారిటీ ప్రతినిథులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.