రాష్ట్ర శిశు సంక్షేమ శాఖా మంత్రి కెవి.ఉషశ్రీచరణ్
ప్రజాశక్తి - భీమవరం రూరల్
అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, అంగన్‌వాడీ ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర శిశుసంక్షేమ శాఖా మంత్రి కెవి.ఉషశ్రీచరణ్ తెలిపారు. బుధవారం భీమవరం మండలంలోని విస్సాకోడేరు ప్రాజెక్టు పరిధిలోని యనమదుర్రు, దెయ్యాలతిప్ప, కోమటితిప్ప అంగన్‌వాడీ సెంటర్లను మంత్రి ఉషశ్రీ చరణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగన్‌వాడీ సెంటర్లలో హాజరు పట్టీని పరిశీలించి చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారం, తదితర సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్త్రీ శిశ సంక్షేమ శాఖకు పెద్దపీట వేశారన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ బి.సుజాతరాణి, సిడిపిఒలు పాల్గొన్నారు.










