అంగన్వాడీలపై వేధింపులు మానుకోవాలి
ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్
ప్రజాశక్తి- పలమనేరు: పలమనేరు ప్రాజెక్టులో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ధర్నాకు ప్రాజెక్టు కార్యదర్శి శ్యామల అధ్యక్షత వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ అంగన్వాడీలపై అధికారుల నిర్లక్ష్య వైఖరి మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ప్రాజెక్టులో అధికారుల వ్యవహరిస్తున్నారని తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కార్యాలయంలో అనేక రకాల ఆక్రమాలు జరుగుతున్న పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సెంటర్లకు సంబంధంలేని బయట వ్యక్తులు వచ్చి పర్యవేక్షణ చేస్తుంటే ఐసిడిసి అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ఐసిడిఎస్ అధికారులు ఆదేశాలిస్తూ స్థానిక సంస్థలు పరిష్కారం కోసం ప్రాజెక్టు స్థాయిలో నెలకొకసారి జాయింట్ సమావేశం జరపాలని ఉన్న పలమనేరులో ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. వెంటనే జాయింట్ సమావేశం నిర్వహించి స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వర్కర్ల మధ్య చిచ్చు పెడుతూ అధికారుల పబ్బం గడుపుతున్నారని దీని మానుకోవాలి అన్నారు. జిల్లా పిడి వెంటనే స్పందించి పలమనేరు ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పోరాటం ఉదతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ నాయకులు అనిత, జీవిత, సుజన లతోపాటు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ గుప్తా, ఐద్వా జిల్లా నాయకురాలు భువనేశ్వరి, అంగన్వాడీలు పాల్గొన్నారు.










