Jun 29,2022 22:40

అంగన్‌వాడీలకు వ(మ)ంట..!
పాత్రలు, గ్యాస్‌ కొరత
సందిగ్ధంలో అంగన్‌వాడీలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

జులై ఒకటి సమీపిస్తుండటంతో అంగన్‌వాడీల్లో వంట కష్టాలు మొదలైయ్యాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో జూలై ఒకటో తేది నుంచి గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం వేడివేడిగా వండి వండించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ సీడీపీఓల ద్వారా సూపర్‌వైజర్లకు అంగన్‌వాడీ కార్యకర్తలకు సర్య్కులర్లు జారీ చేశారు. రెండేళ్ళ క్రితం కరోనా నేపథ్యంలో అంగన్‌వాడీలో పౌషికాహారం వండి వడ్డించే పద్ధతికి స్వస్థిచెప్పి టేక్‌హౌం రేషన్‌పద్ధతి ద్వారా లబ్దిదార్లకు ఇంటింటికి రేషన్‌ అందిస్తున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేసిన వారం రోజుల వ్యవధిలో అంగన్‌వాడీ సెంటర్లలో వేడివేడి వండి వడించాలనే ఆదేశాలతో అంగన్‌వాడీలు పరేషాన్‌ అవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 21ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలు 4,768 మెయిన్‌, 3,640 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 1,128 ఉన్నాయి. వీటి పరిధిలో ఒక్క పూట మధ్యాహ్న సంపూర్ణ భోజనం చేసే 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 70,966 మంది ఉన్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు ఒక్కపూట అంగన్‌వాడీ కేంద్రంలో సంపూర్ణ భోజనం చేసేవారు 43,707 మంది ఉన్నట్లు సమాచారం. వీరందరికి మధ్యాహ్నం పూట ప్రభుత్వం మెనూ ప్రకారం పప్పు, సాంబార్‌, కర్రితో వేడివేడిగా వండి పెట్టాల్సి ఉంటుంది.
గ్యాస్‌ కొరతతో తిప్పలు..
అంగన్‌వాడీ కేంద్రంలో వేడివేడిగా వండి వడ్డించాలంటే వంట పాత్రలు, గ్యాస్‌ కొతర వల్ల ఇబ్బందిగా ఉంది. దీంతో అంగన్‌వాడీలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వేడివేడిగా వండి వడ్డించాలని ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం వంటలు వండేందుకు అవసరమైన వంటపాత్రలు, గ్యాస్‌ సరఫరా చేయాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు పట్టించుకోకుండా వేడివేడిగా వండి వడ్డించాలంటే ఎలా అంటూ అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్న సెక్టరు, ప్రాజెక్టు సమావేశాల్లో సిడిపిఓ, సూపర్‌వైజర్ల దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు కరోనా పేరుతో అంగన్‌వాడీ కేంద్రాల్లో సంపూర్ణ భోజనం వండిచే పద్థతికి స్వస్తి చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం కరోనా 4వ వేవ్‌ విస్తరిస్తోందంటూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న తరుణంలో తిరిగి అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు వేడివేడి భోజనం పేరుతో అక్కడే వండి వండించాలంటే ఎంతమంది తల్లులు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి భోజనం చేస్తారనేది ప్రశ్నగా మారుతోంది. కరోనా పరిస్థితుల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో వండి వడ్డించే కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కోరుతున్నారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకు వంటపాత్రలు, గ్యాస్‌ సరఫరా చేయాలంటున్నారు.
వంట సరే పాత్రలేవీ..?
రెండేళ్ల క్రితం కరోనాతో అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు భోజనం వండి పెట్టే పద్ధతికి స్వస్తి పలికి, టేక్‌హౌం రేషన్‌ను ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం ఉన్నట్లుండి వారంరోజుల వ్యవధిలో అంగన్‌వాడీ సెంటర్ల పరిధిలో వేడివేడిగా వండి వడ్డించాలంటే కష్టం. వంట చేయడానికి వంటిపాత్రలు లేవు, దీనికి తోడు గ్యాస్‌ ఇబ్బందే. కరోనా తిరిగీ విజృభిస్తున్న తరుణంలో గర్భిణులు, బాలింతలు సెంటర్లకు వచ్చి భోజనం చేసే పరిస్థతి లేదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. వంటిపాత్రలు, గ్యాస్‌ సరఫరా చేయాలి.
- ఒ. సృజని,జిల్లా ఉపాధ్యక్షురాలు,
అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌