Jun 28,2023 21:40

ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌కు వినతి పత్రం సమర్పిస్తున్న యూనియన్‌ నాయకులు

      ఉరవకొండ : అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు నాగేంద్ర డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం పట్టణంలో ఉరవకొండ డివిజన్‌ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్‌, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, తదితర సమస్యల పరిష్కారం కోసం జూలై 10, 11 తేదీల్లో కలెక్టర్‌ కార్యాలయాల వద్ద చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. బిజెపి ప్రభుత్వం ఐసిడిఎస్‌ లక్ష్యానికి విరుద్దంగా సెంటర్లను కుదించడానికి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. జీతాలు పెంచ కుండా వారి జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. పర్యవేక్షణ పేరుతో అధికారులు, రాజకీయ నాయకులు చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. మెనూ ఛార్జీలు పెంచి ప్రభుత్వమే గ్యాస్‌ సరఫరా చేయాల న్నారు. పెండింగ్‌ టిఎ బిల్లులు ఇవ్వాలని, సర్వీసులో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి బీమా అమలు చేయాలన్నారు. ప్రీస్కూల్‌ పిల్లలకు అమ్మబడి అమలు చేయడంతో పాటు యూనిఫారం సరఫరా చేసి సెంటర్లలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. టంగుటూరులో హత్యకు గురైన అనుసూయమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అనంతరం ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌కు వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో సిఐటియు జిల్లా నాయకులు రంగారెడ్డి, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ నాయకులు అశ్వర్థమ్మ, ధనలక్ష్మి, నాగలక్ష్మి, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.