ప్రజాశక్తి-రాయదుర్గం అంగన్‌వాడీల్లో పని చేస్తున్న టీచర్లు, హెల్పర్లకే కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని బాలుర హైస్కూల్‌లో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యదర్శి మేరీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం జగన్ అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. గతనెలలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీలు అనంతపురం కలెక్టరేట్ ముందు రెండు రోజులపాటు దీక్షలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. అంగన్‌వాడీలకు వెంటనే కనీస వేతనంతోపాటు పిఎఫ్ ఈఎస్‌ఐ గ్రాట్యూటీ తదితర తదితర సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదివరలో 90 శాతం కేంద్ర ప్రభుత్వం, 10శాతం రాష్ట్రప్రభుత్వం ఐసిడిఎస్‌కు బడ్జెట్ కేటాయించే వారిని, ఇప్పుడు దాన్ని కేంద్రం 60 శాతం, రాష్ట్రానికి 40 శాతం కేటాయించడం చూస్తుంటే అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి పూనుకున్నాయని అర్థం అవుతోందన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేంద్ర, రాష్ట్ర పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఐసిడిఎస్ బలోపేతానికి కేంద్ర బడ్జెట్‌లో సరిపడ బడ్జెట్ కేటాయించాలని, అంగన్‌వాడీలను వర్కర్లుగా కాకుండా ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు శివ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు బేబీ, నాయకురాలు మెహ్రూన్, రాధిక, రాధమ్మ, రుద్రమ్మ, అనురాధ, గోవిందమ్మ, రూప, వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున










