అదిగో ఇదిగో అంటూ కాలయాపన
అంగన్‌వాడీలకు జీతాల బెంగ
మూడు నెలలుగా అల్లాడుతున్న వర్కర్లు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు జీతాల బెంగ పట్టుకుంది. ఎప్పుడు వస్తుందో తెలీకుండా తలలు పట్టుకుంటున్నారు. అదిగో ఇదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఇచ్చే అరాకొర జీతాలూ సక్రమంగా రాకపోవడంతో వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. మూడు నెలలుగా అప్పులు చేసి బతుకుబండి లాగిస్తున్నారు. వడ్డీలు కట్టుకుంటూ వర్కర్లు, హెల్పర్లు అల్లాడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 21 ప్రాజెక్టులున్నాయి. వీటిల్లో 4వేల అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో దాదాపు ఏడువేల మందికిపైగా పని చేస్తున్నారు. ఇందులో వర్కర్‌కు రూ.11,500, హెల్పర్‌కు రూ.7,000 వరకు వస్తోంది. ఈ నామమాత్రపు వేతనాలు ఇవ్వడంలోనూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. వీరంతా గ్రామీణ ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. వారి ఆరోగ్యానికి వీరు ఎంతగానో శ్రమిస్తున్నారు. అంతేకాకుండా ఐదేళ్లలోపు పిల్లలకూ పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. వేతనాలు ఇవ్వకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు.
మూడు నెలలుగా పెండింగ్
ఒకటి, రెండు నెలల పాటు వేతనాలు ఇవ్వకపోతేనే ఎంతో ఇబ్బంది. అయితే మూడు నెలలుగా రాకపోవడంతో అంగన్‌వాడీలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. వేతనాలు రాకపోవడం వల్ల ఒక బాధ ఒకటి అయితే వారికి మార్కెట్‌లో పెరిగిన ధరలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. అదుపు లేకుండా పెరుగుతున్న రేట్ల వల్ల అప్పులు చేసి తెచ్చుకున్న సొమ్ములు పది, 15 రోజులకు చాలడం లేదు.
పెండింగ్ వేతనాలు
వెంటనే చెల్లించాలి
అతి తక్కువ వేతనాలతో శ్రమిస్తున్న అంగన్‌వాడీ కార్మికులకు కూడా మూడు నెలలు జీతాలు ఇవ్వకపోవడం దారుణం. ఇది ప్రభుత్వం చేతకాని పరిపాలనా విధానాన్ని తెలియజేస్తోంది. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి. లేకుంటే ఆందోళనను ఉదృతం చేస్తాం.
- వాణిశ్రీ,
అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్
జిల్లా ప్రధాన కార్యదర్శి










