ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. తెలంగాణా కంటే ఎక్కువ వేతనాలు ఇస్తామని సిఎం జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. బకాయి బిల్లులు, సెంటర్ అద్దెలు చెల్లించాలన్నారు. యాప్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాజకీయ వేదింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వై.వెంకటనారాయణ, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి జమున, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పిస్తున్న సిఐటియు నాయకులు










