Jul 08,2023 21:20

విలేకరులతో మాట్లాడుతున్న అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   ఎంతోకాలంగా అంగన్‌వా డీలు ఎదుర్కొంటున్న సమస్యల పరి ష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా గౌరవా ధ్యక్షులు ఎస్‌.నాగేంద్రకుమార్‌ డిమాం డ్‌ చేశారు. శనివారం నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల పర్యవే క్షణ పేరుతో ఫుడ్‌ కమిషనర్‌, ఎంఎస్‌కె, ఎంఆర్‌ఒ, ఎండిఒ, రాజకీయ నాయకులు పర్యవేక్షణ పేరుతో అంగన్‌వాడీలను వేధించడంతోపాటు అవమాని స్తున్నారన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాజెక్టు లోని హనుమాయమ్మను రాజకీయ కక్షలతో నిర్ధాక్ష ణ్యంగా చంపారన్నారు.కనీసం మట్టి ఖర్చులు ఇచ్చే దిక్కు కూడాలేదన్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేయా లని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌లు ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లకు వయో పరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని, 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు కల్పించాలని, అంగన్‌వాడీ విద్యను బలోపేతం చేయాలని, పిల్లలకి యూనిఫాం, అమ్మఒడి అమలు చేయాలని, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, మెనూఛార్జీలను పెంచాలని, ప్రభుత్వమే గ్యాస్‌ సరఫరా చేయాలని, 2017 నుంచి పెండింగ్‌ లో ఉన్న టిఎ బిల్లులు ఇవ్వాలని, సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల ని, బీమా అమలు చేయాలని, లబ్ధిదారులకు నాణ్య మైన ఆహారాన్ని సరఫరా చేయాలని, ఆయిల్‌, కంది పప్పు క్వాంటిటీ పెంచాలని, సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, హత్యకి గురైన హనుమాయమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, నష్టపరిహా రం చెల్లించాలని, గ్రేడ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని, 2022లో పరీక్ష రాసి పెండింగ్‌లోఉన్న ఉన్న గ్రేడ్‌ ఎ సూపర్‌వైజర్‌ పోస్టుల్లో మిగిలిన 164 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 10, 11వ తేదీల్లో 36 గంటల నిరవధిక ఆందోళన చేయనున్న ట్లు తెలిపారు. ఈ ఆందోళనకు జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీలు, హెల్పర్లు, మివీ వర్కర్లు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం.నాగమణి, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, రమాదేవి, జమున, కాత్యాయని, రేష్మ, భారతి, తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీలకు ఐద్వా సంపూర్ణ మద్దతు
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈనెల 10, 11వ తేదీల్లో కలెక్టరేట్‌ ఎదుట చేపడుతున్న 36 గంటల నిరసనకు ఐద్వా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా మహిళలు, చిన్న పిల్లలకు పోషకాహారం, విద్య తదితర సౌకర్యాలు అందుతున్నాయన్నారు. అలాంటి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఐసిడిఎస్‌ను బలోపేతం చేసి విరివిగా బడ్జెట్‌ ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కోతలు విధించడం అన్యాయం అన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు చేపడుతున్న ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఆందోళనలో పాల్గొననున్నట్లు తెలిపారు.