రాయదుర్గం : రాష్ట్ర వ్యాప్తంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో పని చేస్తున్న అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్ చేశారు. బుధవారం నాడు రాయదుర్గం ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, వర్కర్ల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి జూలై 10,11వ తేదీల్లో అనంతపురం కలెక్టరేట్ ముందు రెండు రోజులపాటు చేపడుతున్న నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్, హెల్పర్ మినీ వర్కర్లు అందరూ పాల్గొనాలన్నారు. పోరాటం ద్వారానే సమస్యలను పరిష్కరించుకోగలమని చెప్పారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సిడిపిఒకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున, రాయదుర్గం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు మేరీ, బేబీ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.










