Jul 10,2023 22:21

అనంతపురం కలెక్టరేట్‌ వద్ద 36 గంటల నిరసన దీక్షలో పాల్గొన్న అంగన్‌వాడీలు

         అనంతపురం కలెక్టరేట్‌ : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై అంగన్‌వాడీలు కన్నెర్ర చేశారు. ప్రభుత్వం మొద్దునిద్రను తొలగించేందుకు పోరబాట పట్టారు. 36 గంటల నిరసన దీక్ష పేరుతో చేపట్టిన ఆందోళన కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభం అయ్యింది. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా నలమూల నుంచి తరలొచ్చిన వేలాది మంది అంగన్‌వాడీ కార్మికులు, మినీ కార్మికులు పాల్గొన్నారు. వీరి నిరసనతో కలెక్టరేట్‌ ప్రాంతం దద్దరిల్లింది. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నూర్‌ మహమ్మద్‌, జిల్లా కార్యదర్శి నాగేంద్ర కుమార్‌, అధ్యక్షులు నాగమణి, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా నేతలు శకుంతల, రమాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నూర్‌ మహమ్మద్‌ మాట్లాడుతూ ఐసిడిఎస్‌ వ్యవస్థను అంతం చేయడానికి నూతన విద్యా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. దానికి వంతు పడుతూ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కూడా బైజుస్‌ పేరుతో అంగన్వాడీల పీకపిసికే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల అమలు విషయంలో అన్ని పనులకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బందిని ఉపయోగించుకుంటోందన్నారు. ఇంత కష్టపడి పని చేస్తున్న వారి సమస్యల పరిష్కారంలో మాత్రం నిర్లక్ష్య వైఖరి అవలంభించడం విచారకరం అన్నారు. అంగన్‌వాడీలకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే ఆన్‌లైన్‌ పనులు ప్రారంభించారన్నారు. ఫోన్‌లు పని చేయక పోవడం, ఆన్‌లైన్‌ వర్క్‌ చేయడానికి అవసరమైన నెట్‌ సిగల్స్‌ లేకపోవటం వల్ల అంగన్‌వాడీ సిబ్బంది తీవ్ర మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలను పెంచాల్సి ఉందన్నారు. అంగన్‌వాడీలు పోరాటాల ఫలితంగా 2018లో మోడీ దీపావళి కానుకగా వర్కర్‌కి రూ.1,500, హెల్పర్‌కి రూ.750, మినీలకి రూ.1,250 వేతనాలు పెంచుతానని హామీ నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. తెలంగాణలో ఇచ్చే వేతనం కన్నా అదనంగా రూ.వెయ్యి ఇస్తామన్న హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. వైఎస్సాఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ, మెనూ ఛార్జీలు పెంచాలన్నారు. 2017 నుండి టీఏ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సెంటరు అద్దెలు 4 నెలల నుంచి ఇవ్వలేదన్నారు. నెలనెలా వేతనాలు వచ్చే పరిస్థితీ లేదన్నారు. తక్షణం ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ అందరికీ బటన్‌ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అంగన్‌వాడీల సమస్యలపైనా సానుకూలంగా స్పందించాలన్నారు. అతి తక్కువ వేతనాలతో పని చేసే అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేయకపోవడం విచారకరం అన్నారు. హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో మినీ వర్కర్లకు కనీసం వేసవి సెలవులు ఇవ్వడంలేదన్నారు. ప్రమోషన్లు ఇవ్వాలని జీవో ఉన్నా కూడా అమలు కావట్లేదు. దీంతో మినీ వర్కర్లు అనేక ఇబ్బందులు పడు తున్నారని తెలిపారు. ఈ సమస్యలన్నింటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించకపోతే అంగన్‌వాడీల ఆందోళనను రాష్ట్ర స్థాయి ఉద్యమంగా కొనసాగిస్తామని దీక్షా శిబిరం నుంచి నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, జిల్లా అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్షురాలు శంకుతల, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం.నాగమణి, నాయకులు నాగభూషణం, వెంకటనారాయణ, గోపాల్‌, ఏటీఎం నాగరాజు, మన్నీల రామాంజనేయులు, శ్యామల, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్‌, శివ తదితరులు పాల్గొన్నారు.