
* హామీల విస్మరణ, ప్రభుత్వ నిర్బంధంపై మండిపాటు
* కలెక్టరేట్ వద్ద ధర్నా
* లోపలకు చొచ్చుకువెళ్లేందుకు యత్నం
* 42 మంది అరెస్టు, విడుదల
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: తెలంగాణ కంటే అదనంగా రూ.వెయ్యి వేతనం అమలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు రోడ్డెక్కారు. తమను విజయవాడ వెళ్లనీయకుండా ప్రభుత్వం అరెస్టులకు పాల్పడడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అంగన్‌వాడీలు కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన తొలుత ఆర్‌అండ్‌బి అతిథిగృహం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రభుత్వ నిర్బంధం నశించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ లోపలకు చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో వారికి, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులను తప్పించుకుంటూ అంగన్‌వాడీలు ముందుకెళ్లడంతో వారిని అడ్డుకుని వాహనాల్లోకి ఎక్కించారు. ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు అంగన్వాడీ యూనియన్ నాయకులు కె.కళ్యాణితో పాటు 42 మందిని అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి మాట్లాడుతూ తెలంగాణ కంటే అదనంగా రూ.వెయ్యి వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు అందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలకు గౌరవ వేతనం పేరుతో అతి తక్కువ వేతనాలు ఇస్తూ అమ్మఒడి, చేయూత, ఆసరా, ఇళ్లస్థలాలు వంటి సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారని చెప్పారు. అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని కోరారు. అంగన్వాడీలకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. ప్రభుత్వం 2017 నుంచి చెల్లించాల్సిన టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని, ఆయిల్, కందిపప్పు పరిమాణం పెంచాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పి.అప్పారావు, ఎస్.కిశోర్ కుమార్, రాష్ట్ర నాయకులు చౌదరి రవీంద్ర ఆందోళనలకు సంఘీభావం తెలిపారు.
పోలీసులకు ఝలక్
అంగన్‌వాడీల ఆందోళనల నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అంగన్‌వాడీలను అరెస్టు చేసేందుకు వాహనాలను సైతం సిద్ధంగా ఉంచారు. ఆర్‌అండ్‌బి అతిథిగృహం నుంచి ర్యాలీగా వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లను పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆందోళనల తర్వాత వారంతా ఇళ్లకు వెళ్లిపోతారని భావించిన పోలీసులు చెట్ల నీడలో సేదతీరారు. ధర్నా ముగిసిన తర్వాత అనూహ్యంగా కలెక్టరేట్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో కంగుతున్న పోలీసులు ఒక్కసారిగా చేరుకుని వారిని వాహనాల్లోకి ఎక్కించి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలకు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు ద్విచక్ర వాహనాన్ని పోలీసులు ఆపి వారి వాహనంలో స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పి.లతాదేవి, జె.కాంచన, పి.ఆదిలక్ష్మి, కె.సుజాత, రాజేశ్వరి, మంజుల, భూలక్ష్మి, సిఐటియు నాయుకులు ఎ.సత్యనారాయణ, ఎం.ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పలాసలో నిరసన ర్యాలీ
పలాసలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యాన కాశీబుగ్గ బస్టాండ్ నుంచి ఐసిడిఎస్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐసిడిఎస్ పిఒ డి.శర్వాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, అంగన్వాడీ యూనియన్ నాయకులు బి.సునీత, ఎల్.దమయంతి, బి.చామంతి, బి.తులసి, జె.శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురంలో మానవహారం
ఇచ్ఛాపురంలో అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ కూడలి వరకు మానవహారం నిర్వహించి, అనంతరం ధర్నా చేపట్టారు. పట్టణ, రూరల్ ఎస్‌ఐలు గోవిందరావు, రమేష్ ఆధ్వర్యాన పోలీసులు అంగన్‌వాడీలను అక్కడ్నుంచి పంపించే క్రమంలో వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. అంగన్‌వాడీల ఆందోళనకు టిడిపి, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లకీëనారాయణ, అంగన్వాడీ యూనియన్ నాయకులు హైమావతి, విజయ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద బైఠాయించిన అంగన్‌వాడీలు