ప్రజాశక్తి-పెద్దపంజాణి : మండలంలోని రాయలపేట ప్రాథమిక పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు గీత ఉగాది పురస్కారం అందుకున్నారు. తిరుపతిలో వే ఫౌండేషన్ అనే అంతర్జాతీయ సంస్థ వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న వారిని గుర్తించి శుభకృతు నామ సంవత్సరానికి గాను ఉగాది పురస్కారాలు ప్రకటించారు. రాయలపేట ఉపాధ్యాయురాలు గీత ఈ పురస్కారానికి ఎంపియ్యారు. తిరుపతి యూత్ హాస్టల్ వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన ఉగాది వేడుకలలో ఈ పురస్కారాన్ని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఉపకులపతి రాజారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సమావేశంలో వైస్ ఛాన్సలర్ రాజారెడ్డి మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయురాలు గీత ఎంతో అంకితభావంతో వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తూ పేద పిల్లలకు సృజనాత్మకంగా భోధన చేస్తూ వారి సర్వతోముఖ అభివృద్ధికి గట్టి పునాదులు వేస్తోంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తూ సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటున్న గీత అభినందనీయులు అని కొనియాడారు.వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.అంకయ్య మాట్లాడుతూ స్త్రీ లోకం గర్వించదగిన స్థాయిలో గీత ముందడుగు వేస్తూ గృహిణిగా, ఉపాధ్యాయురాలు గా, శిక్షకురాలిగా, నాయకురాలిగా, సామాజిక సేవ స్పృహ కలిగిన వ్యక్తిగా ముందుకెలుతుండడం గొప్ప విషయం అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వే ఫౌండేషన్ అంతర్జాతీయ విలువలు పాటిస్తూ ముందుకెలుతున్న సంస్థ అని అలాంటి సంస్థ నుంచి నేను పురస్కారం అందుకోవటం ఆనందంగా ఉందని... కృతజ్ఞతలు తెలియజేశారు. గీత ఉగాది పురస్కారం అందుకున్న సందర్భంగా మండలంలోని పలువురు ఉపాధ్యాయులు శ్రీనివాసులు, ఆమెకు శుభాభినందనలు తెలియజేశారు.










