అనంతపురం ప్రతినిధి : వివిధ తరగతుల వారిని కలుసుకుంటూ... వారి సమస్యలు తెలసుకుంటూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం కొనసాగింది. ఆదివారం ఉదయం జంబులదిన్నె వద్ద ప్రారంభమైన పాదయాత్ర వెస్టు నరసాపురం, చిన్నజలాలపురం, శింగనమల మీదుగా సోదనపల్లి క్రాస్ వరకు పాదయత్ర సాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల వివిధ తరగతుల వారిని కలుసుకుని లోకేష్ మాట్లాడారు. ఉదయం ప్రయివేటు ఆసుసత్రుల డాక్టర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 20,30 పడకలున్న ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ప్రయివేటు డాక్టర్సు కోరారు. దంత సమస్యలకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని కోరారు. దీనికి లోకేష్ సానుకూలంగా స్పందించారు. అనంతరం పాదయాత్ర వెస్టునరసాపురం వద్దకు చేరుకుంది. అక్కడ లోకేష్ పొలంలోకి దిగి కౌలు రైతులతో మాట్లాడారు. వేరుశనగ పంట సాగు చేస్తే పెట్టుబడి కూడా చేతికి రాలేదని రైతులు తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. విద్యుత్ మోటర్లకు మీటర్లు పెడుతామంటున్నారు... ఇప్పటికే వ్యవసాయం భారమైన సమయంలో ఇది అమలు జరిగితే మరింత భారం పడుతుందని మహిళా రైతు లక్ష్మిదేవి లోకేశ్‌కు చెప్పారు. మరో తోటలో బెండ రైతు నారాయణరెడ్డితో మాట్లాడారు. రూ.70 వేలు పెట్టుబడి అయ్యిందని, అది కూడా వచ్చే పరిస్థితి లేదని నారాయణరెడ్డి తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టి గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన లోకేశ్‌ను కోరారు. వాల్మీకులను ఎస్టీల జాబాతాలో చేర్చాలని వాల్మీకి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. దీనికి లోకేశ్ స్పందిస్తూ టిడిపి హాయంలో దీనిపై వేసిన సత్యపాల్ కమిటీ నివేదిక వచ్చిందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దానిని బయటపెట్టలేదని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే కమిటీ నివేదికను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని హామీనిచ్చారు. విశ్వ బ్రాహ్మణులు ఆయన్ను కలసి వారి సమస్యలను విన్నవించారు. వడ్రంగి పనిచేసే విశ్వ బ్రాహ్మణులకు ప్రభుత్వం వైపు నుంచి తోడ్పాటు అందివ్వాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామని లోకేష్ హామీనిచ్చారు. అనంతరం కురబ సంఘం నాయకులు, గొర్రెల కాపరులు కలసి వారి సమస్యలను తెలియజేశారు. గొర్రెల పెంపకానికి పది ఎకరాల భూమిని గ్రామానికి కేటాయించాలని, వంద శాతం సబ్సిడీతో గొర్రెల షెడ్డు ఇవ్వాలని, కురబ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చాక కురుబలకు తగిన న్యాయం చేస్తామని హామీనిచ్చారు. వెస్టు నరసాపురం, చిన్నజలాల పురం గ్రామస్తులు వారి గ్రామాలకు పిఎబిఆర్ నీటిని అందవ్వాలని కోరారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను పలుకరిస్తూ లోకేష్ పాదయాత్ర సాగింది. శింగనమల వద్ద చెరువుల్లో బోట్లలో స్వాగతం బ్యానర్లు పట్టుకుని టిడిపి నాయకులు స్వాగతం పలికారు. అదే విధంగా శింగనమల రామాలయం వద్ద క్రేన్ సహాయంతో గజమాలతో స్వాగతం పలికారు. ఇలా పెద్దఎత్తున లోకేశ్ పాదయాత్రకు స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో శింగనమల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండారు శ్రావణి, టూమెన్ కమిటీ సభ్యులు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు ఎంఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.










